- వెండి పల్లకిపై పురవీధుల్లో ఊరేగింపు
- వైభవంగా ప్రారంభమైన చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు
- పుణ్య దంపతులను తిలకించేందుకు తరలివస్తున్న భక్తులు
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఇల కైలాసంగా కీర్తింపబడుతున్న ఇంద్రకీలాద్రిపై ఆదిదంపతులు వధూవరులుగా చూడముచ్చటగా ముస్తాబయ్యారు. ఆ పుణ్య దంపతుల కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు.
నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈనెల 8వ తేదీ మంగళవారం నుండి 13వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వరులకు నిర్వహించే చైత్రమాస కల్యాణ మహోత్సవాల సందర్భంగా మొదటిరోజు శ్రీ దుర్గా మల్లేశ్వరులకు మంగళ స్నానాలు వధూవరులుగా అలంకరణ చేశారు.
సాయంత్రం 4 నుండి విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, అఖండ దీప స్థాపన, కలశారాధన, బలిహరణ, అగ్ని ప్రతిష్టాపన, ద్వజారోహణం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ వాహన సేవల్లో భాగంగా… సాయంత్రం మల్లేశ్వర మహామండపం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి పల్లకి సేవ ప్రారంభం అయింది.
సంప్రదాయ కళలైన తప్పెట్లు, కోలాట నృత్యములు, తాళం భజన కళాకారుల ప్రదర్శలు ముందు సాగుతుండగా, వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి పల్లకివాహనసేవ కనకదుర్గానగర్, రధం సెంటర్, బ్రాహ్మణవీధి, కొత్త పేట, మెయిన్ బజారులలో భక్త కోటిని అనుగ్రహిస్తూ ఊరేగింపు సాగుతుంది.
ఆది దంపతులు వేంచేసిన పల్లకి ముందు భక్తులు రహదారులను పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు,కొబ్బరికాయలు సమర్పించి, జయ జయ ద్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానా చార్య శివ ప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.