ఏపీలో భారీ వర్షాలు..

ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఇచ్చిన హెచ్చరికల ప్రకారం, బుధవారం పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

ఎడతెరిపి లేని వర్షాల వల్ల రోడ్లు జలమయం అయ్యాయి, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఇది ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు. అలాగే, తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం కొనసాగుతున్న వినాయక చవితి వేడుకల నేపథ్యంలో, గణేష్ మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ కోరారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Leave a Reply