( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : రాజధాని ప్రాంతమైన విజయవాడ ప్రాంతంలో డిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు రానున్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్ పేర్కొన్నారు.
ఈ ప్రాంత పారిశ్రామికాభివృద్దికి ఎలాంటి వ్యూహాం అనుసరించాలి, ఎటువంటి పరిశ్రమల ఏర్పాటుతో త్వరగా పారిశ్రామికాభివృద్ది జరుగుతుందనే అంశంపై త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటి,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి చర్చించనట్లు తెలిపారు.
రాబోయే కాలంలో విజయవాడ నగర ప్రాంతం పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశంపై డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డితో ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులతో ఎంపి కేశినేని శివనాథ్ తన కార్యాలయంలో (గురువారం) సమావేశం ఏర్పాటు చేశారు.
సతీష్ రెడ్డి పారిశ్రామిక వేత్తలకు రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీలు అభివృద్ది చెందాల్సిన అవసరం, ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి చెప్పటంతో పాటు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఎంపి కేశినేని శివనాథ్ చేస్తున్న కృషిని వివరించారు. అలాగే పారిశ్రామిక వేత్తలు అడిగిన సందేహాలకు సతీష్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్, డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అందరి సూచనల మేరకు ఇంజనీరింగ్ కోర్సుల్లో తీసుకురావాల్సిన మార్పులు, నేటి కాలానికి అనుగుణంగా పరిశ్రమలకు ఉపయోగపడేలా జోడించాల్సిన అదనపు కోర్సులపై మంత్రి నారాలోకేష్‌తో చర్చిస్తామని అన్నారు. పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు యూనివర్శిటీలో ఉండే విధంగా కృషి చేస్తామన్నారు.
డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి నగరంలో ముఖ్యంగా రాజధాని నగరంలో ఇండస్ట్రీలు, స్టార్టప్ లు చాలా ప్రముఖంగా దేశంలో వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్, ఎరోస్పెస్, కమ్యూనికేషన్, రైల్వే రంగాల్లో స్వదేశీయంగా ఉత్పత్తులు తయారు చేయించి వాటినే వాడాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని తెలిపారు.
అందుకే ఆయా మంత్రిత్వ శాఖలో విదేశాల నుంచి ఏ వస్తువులు దిగుమతి చేసుకుంటున్నామో ఒక జాబితా తయారు చేసి వెబ్ సైట్ లో పెడుతున్నట్లు తెలిపారు. దేశంలోని పారిశ్రామికవేత్తలతో వాటిని తయారు చేయించాలనే ఉద్దేశ్యంతో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రకరకాల పథకాలు అమల్లోకి తీసుకువచ్చిందన్నారు.
ఎపి రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీలో అభివృద్ది చెందాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ముఖ్యంగా విజయవాడ ఈ నగర చుట్టూపక్కల ప్రాంతాలతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీలు పెరగాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ ప్రాంతంలో సాధారణ పరిశ్రమలతో పాటు డిఫెన్స్, ఎరోస్పెస్ ఇండస్ట్రీలను ఎలా అబివృద్ది చేయాలి.. ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలి.. ఈ పరిశ్రమల స్థాపనకు ప్రాంతం అయితే బాగుంటుందనే అంశంపై సమాలోచనలు ఇద్దరి మధ్య జరిగినట్లు చెప్పారు.
ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాధించాలంటే ప్రభుత్వంతో కలిసి పారిశ్రామికవేత్తలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పలు అసోసియేషన్ల సభ్యులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
