వెలగపూడి – రెండు లక్షల పెన్షన్లు తగ్గించారని.. దివ్యాంగుల పెన్షన్లను కూడా తగ్గించేశారని వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. వివిధ కారణాలతో పెన్షన్లు తొలగిస్తున్నారన్నారు. పేదలకిచ్చే పెన్షన్ల విషయంలో భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ వాళ్ళెవరికి పని చేయవద్దని సీఎం చంద్రబాబే చెప్పారంటూ వ్యాఖ్యలు చేశారు. నేడు మండలిలో ప్రశ్నోత్తరా సమయంలో సామాజిక పెన్షన్ల సంఖ్య తగ్గింపుపై ఆసక్తికర చర్చ జరిగింది. 14 వేల పెన్షన్లు తగ్గించినట్లు చెబుతున్నారని కానీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే రెండు లక్షల పెన్షన్లు తగ్గించినట్లు అర్థం అవుతుందని వైసీపీ సభ్యుడు రమేష్ యాదవ్ అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చారా లేదా అని అడిగారు. వైసీపీ హయాంలో ఐదేళ్ళలో 13 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చామని రమేష్ తెలిపారు. పెన్షన్ల తొలగింపులో ఏ విధానాలు పాటిస్తున్నారని మరో సభ్యుడు మొండితో అరుణ్ కుమార్ ప్రశ్నించారు. పదిహేను రోజుల్లో దివ్యాంగుల సర్టిఫికెట్ ఇవ్వాలని కండిషన్ పెట్టారని, 13 పాయింట్లు వెరిఫికేషన్ చేస్తున్నారని అరుణ్ పేర్కొన్నారు.

పెన్షన్లు తగ్గించింది మీరే..
వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇస్తూ.. పెన్షన్లు ఇచ్చిందే ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. 200 నుంచి 1000, 1000 నుండి 2000 చేసింది టీడీపీయే అని గుర్తుచేశారు. 3000 నుంచి 4000 రూపాయలకు పెంచింది కూడా కూటమి ప్రభుత్వమే అని తెలిపారు. 13 శాతం జనాభాకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. 2019 నుంచి 2024 వరకూ 24 లక్షల పెన్షన్లు తగ్గించారు. 13 పాయింట్ వెరిఫికేషన్ తాము చేయడం లేదని స్పష్టం చేశారు. రెండు లక్షల పెన్షన్లు తగ్గించామనేది అసత్యమన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షా ఎనభై వేల మంది చనిపోయారని తెలిపారు. 14 వేల పెన్షన్లు తొలగించిన వారిలో శాశ్వత వలసదారులే అధికంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులకి పెన్షన్లు ఇచ్చారన్నారు. హెల్త్ పెన్షన్‌కు ఎప్పుడైనా అర్జీ పెట్టుకోవచ్చని తెలిపారు. కడప జిల్లాలో 3000పైగా దివ్యాంగుల పెన్షన్లున్నాయన్నారు. కలెక్టర్ వెరిఫై చేస్తే కేవలం 1300 మంది మాత్రమే అర్హులని తేలిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
ఆడబిడ్డ నిధి పథకంపై…

ఇక ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. 18 – 60 ఏళ్ళ మధ్యనున్న మహిళలకు నెలకి 1500 ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకూ ఎంత మంది లబ్దిదారులు ఉన్నారో గుర్తించారా అని అడిగారు. ఎంత నిధులు అవసరం అవుతాయో లెక్కగట్టారా అని ప్రశ్నించారు. మంత్రి వర్గ ఉపసంఘం కాని అధికారుల కమీటీగాని వేశారా అని ప్రభుత్వాన్ని అడిగారు. దాదాపు కోటి మందికిపైగా లబ్దిదారులు ఉన్నారని.. ఏడాదికి 32000 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అన్నారు.
తప్పకుండా అమలు చేస్తామన్న మంత్రి
ఆడబిడ్డ నిధి బడ్జెట్ కోసం ప్రణాళికాబద్ధంగా వెళుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వానికి కొంత సమయం కావాలని.. ఆడబిడ్డ నిధి పథకం కచ్చితంగా అమలు చేస్తాంమని మండలిలో మంత్రి స్పష్టం చేశారు.