ap cm thown ycp : వైసీపీ హయాంలో మహాపాపం Andhra Prabha News

ap cm thown ycp : వైసీపీ హయాంలో మహాపాపం Andhra Prabha News
- కల్తీతో అపవిత్రం చేశారు
- తిరుమల గిరులను కుదించారు…
- తిరుమల డిక్లరేషన్ పై జగన్ ధిక్కారం
- గత పాలనలోనే అన్యమత ప్రచారం
- కల్తీకి ఆస్కారం లేని విధంగా కఠినతరంగా నిబంధనలు
- హిందువుల మనోభావాలు కాపాడే బాధ్యత మాది
- కల్తీ నెయ్యి వ్యవహారంపై శాసనసభలో లఘు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం వివరణ
( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి)
ఓ పద్ధతి ప్రకారమే 2005 నుంచి హిందూమతంపై దాడి జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుమల పరిధిని ఏడు కొండల నుంచి రెండు కొండలకు మాత్రమే పరిమితం చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవో తీసుకువచ్చారని అప్పటి నుంచే హిందూ మతంపై క్రమబద్ధంగా దాడి చేస్తూ వచ్చారని ఆక్షేపించారు.

అప్పటి పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శామ్యూల్ అనే క్రైస్తవ అధికారి ఈ జీవో జారీ చేశారని వివరించారు. హిందూ సమాజంతో పాటు రెండేళ్ల పాటు తాము చేసిన పోరాటాల కారణంగా వెనక్కు తగ్గారని సీఎం స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై శాసనసభలో చేపట్టిన లఘు చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ వ్యవహారంపై మహాపాపం పేరిట అసెంబ్లీలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ హయాంలో 20.01 కోట్ల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేసి ఘోర అపచారం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. రాజకీయ వివాదం ఉండకూడదని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సిట్ ఏర్పాటైందని సీఎం వివరించారు.

సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. తప్పు చేసిన నిందితులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు పంపించిందని అన్నారు. అందుకే ఈ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. లడ్డూ వ్యవహారంలో అనేక తప్పులు చేశారని సీఎం స్పష్టం చేశారు. 2019-24 మధ్య 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారని అన్నారు. రూ. 231.51 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని నీరుగార్చారని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహరం ఓ ప్రణాళిక ప్రకారం లాలూచీ పడిన లూటి అని స్పష్టంగా తేలిందన్నారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినా… నివేదికలు వచ్చినా అప్పటి టీటీడీ చైర్మన్ దానిని తొక్కి పెట్టారని అన్నారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తానేమి సొంతగా చెప్పలేదని ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చిన నివేదికనే బయటకు వెల్లడించానని అన్నారు.
ap cm thown ycp : తెలియకుండా తప్పులు జరిగాయా…?
కల్తీ నెయ్యి సరఫరాకు అనుగుణంగా టెండర్ నిబంధనల్ని సడలించారని.. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సరఫరా చేయాలన్న నిబంధన తొలగించారని పేర్కొన్నారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి 1 ఏడాదికి కుదించారన్నారు. రోజుకు 12 టన్నుల వెన్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని 8 టన్నులకు తగ్గించారని అన్నారు. అక్రమాలకు తెరతీసేలా డెయిరీల వార్షిక టర్నోవర్ రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పరిమితం చేశారన్నారు.

సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారని.. వీటితో పాటు ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని కూడా నీరుగార్చారన్నారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా పోమిల్ జైన్ , విపిన్ జైన్ తో పాటు భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ఉందన్నారు. ఏఆర్, శ్రీవైష్ణవీ, మాల్ గంగా డెయిరీలు భోలే బాబా డెయిరీకి షెల్ కంపెనీలుగా వ్యవహరించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని సీఎం స్పష్టం చేశారు. రూ.4.5 కోట్ల లంచం డబ్బుతో నాటి చైర్మన్ పీఏ చిన్నప్పన్న అడ్డంగా దొరికి పోయారని సీఎం తెలిపారు. తప్పుడు రిటర్నులతో తప్పుదారి పట్టించారని.. ల్యాబ్ నివేదికల్ని కూడా ఫోర్జరీ చేశారన్నారు. ల్యాబ్ ల కన్నుగప్పి టెండర్లు దక్కించుకున్నారని అన్నారు. కల్తీ నెయ్యి తయారీకి, సరఫరాకు ఓ ముఠాగా ఏర్పడ్డారని… తయారికి వివిధ రకాల రసాయనాలు వినియోగించినట్టు కూడా సిట్ తేల్చిందన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేసి ఘోర అపచారం చేశారని ముఖ్యమంత్రి అన్నారు.

టీటీడీలోని సాంకేతిక నిపుణులకు కూడా ఖరీదైన ఫోన్లు ఎరవేసి కల్తీ నెయ్యికి గేట్లు తెరిచారన్నారు. మోనో గ్లిసరైట్, ఎసిటిక్ యాసిడ్ లాంటి డ్రమ్ములను, లంచాల వివరాలతో కూడిన డైరీని కూడా సిట్ స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఈ కుట్రకు పాల్పడిన నిందితులపై సిట్ అభియోగాలు కూడా మోపిందన్నారు. తప్పు చేసిన వ్యక్తులు ఇప్పుడు మళ్లీ బుకాయించి మాపైనే ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ టీటీడీ బోర్డు చైర్మన్ కు తెలియకుండా జరుగుతాయా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఆ సమయంలో ప్రసాదం తీసుకున్న ప్రతీ ఒక్కరూ నాణ్యత తగ్గిందని చెప్పారని వివరించారు.
ap cm thown ycp : అన్యమతస్తులతో టీటీడీని నింపేశారు

ఎవరికి ఏ బాధ వచ్చినా శ్రీ వేంకటేశ్వరస్వామిని మొక్కుకుని ఆయనతో చెప్పుకుంటామని.. 2019-24 మధ్య స్వామి వారికి జరిగిన అపచారం పట్ల తీవ్ర ఆవేదన చెందామని అన్నారు. శ్రీవారి ఆలయంలో అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పోరాడితే కేసులు పెట్టి వేధించారని శాసనసభలో సీఎం వివరించారు. రామతీర్ధంలో రాముడి తల నరికారని అక్కడికి వెళ్తే తన పైనా కేసులు పెట్టారని తెలిపారు. బ్రిటీషర్లు కూడా తమ పాలనలో తిరుమల శ్రీవారి జోలికి వెళ్లలేదని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. సామాన్య భక్తులు ఏడు కొండలవాడా గోవిందా అనే నామాన్ని స్మరిస్తూ తిరుమలకు వెళ్తారని అలాంటి ఏడు కొండలను రెండు కొండలకు కుదిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాడి మొదలెట్టారని అన్నారు.
ఈ నిర్ణయంపై రెండేళ్ల పాటు దేశంలోని హిందువులంతా తీవ్ర ఆందోళనలు చేయటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని అన్నారు. ఈ అంశంపై పోరాటం చేసిన తనపైనా ఆరోపణలు, ఫేక్ ప్రచారం చేశారని ముఖ్యమంత్రి వివరించారు. ఉడిపి పెజోవర్ మఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామిజీ ఆదేశం మేరకు ఏర్పాటు అయిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తిరుమలలో అన్యమత జోక్యంపై నివేదిక ఇచ్చిందన్నారు. తిరుమలతో పాటు అక్కడి విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరింగిందని, ఉద్యోగులు, దుకాణాల్లోనూ అన్యమతస్తులు ఉన్నట్టుగా తేల్చిందని వివరించారు. గతంలో తిరుమల స్పెసిఫైడ్ అథారిటి అధ్యక్షుడిగానూ క్రైస్తవుడైన అధికారిని తప్పించాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీవేంకటేశ్వరా యూనివర్సిటీ, పద్మావతి విశ్వవిద్యాలయాలకు కూడా వీసీలుగా క్రిస్టియన్లనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నియమించారని పేర్కొన్నారు.

వారి హయాంలో బలవంతపు మత మార్పిడులు కూడా జరిగాయని ఆరోపణలు వచ్చినట్టు వివరించారు. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపైనా జెరుసలేం యాత్రకు వెళ్లాలంటూ అన్యమత ప్రచారం చేశారన్నారు. టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా గత పాలకులు వ్యవహరించారని.. అన్యమతస్తులైన చైర్మన్లను నియమించారన్నారు. నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి క్రిస్టియన్ గా బైబిల్ పట్టుకుని తిరిగారని ఆరోపించారు. అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కుమార్తెకు మెదక్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటి వారిని చైర్మన్లుగా ఎలా నియమిస్తారని సీఎం ప్రశ్నించారు. గత పాలకుల హయాంలో టీటీడీ వెబ్ సైట్ లో ఏసు ప్రభువు ఫోటో, శిలువ కూడా వచ్చేసిందని అన్నారు. దీనిపై పత్రికల్లో రాస్తే… ఆ పత్రికల్ని బెదిరించటానికి వంద కోట్ల డిఫమేషన్ వేయించారని అన్నారు.
ap cm thown ycp : తిరుమల అంటే గత పాలకులకు చులకన
లేని పింక్ డైమండ్ చోరీ అంటూ గతంలో తనపై దుష్ప్రచారం కూడా చేశారని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. శ్రీవారిని అప్రతిష్టపాలు చేసే కుట్రకు ఇది మరో ఉదాహరణ అని అన్నారు. జంబో పాలక మండలి నియామకంతో రాజకీయ పునరావాసంగా టీటీడీని మార్చేశారని సీఎం అన్నారు. హైకోర్టు తప్పు పట్టటంతో గత పాలకులు ఆ జీవోను వెనక్కు తీసుకున్నారని తెలిపారు. పరకామణిలో చోరీ జరిగితే దానిని కూడా సెటిల్ చేసేందుకు రాజీ ప్రయత్నాలతో పాటు చోరీని సమర్థిస్తూ చులకనగా గత పాలకులు మాట్లాడారని వివరించారు. దేవదేవుడి హుండీలో చోరీ జరిగితే ఇంత చులకనగా మాట్లాదతారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తిరుమల క్షేత్రానికి వెళ్లిన ఎవరైనా అక్కడ నిర్దేశించిన ఆచార సంప్రదాయాలను పాటిస్తారని… శ్రీవారి ఆలయానికి వెళ్లి డిక్లరేషన్ పై సంతకం చేయమంటే చేయకుండా గత పాలకుడు ధిక్కరించారని అన్నారు.
డిక్లరేషన్ పై క్యాన్సిల్ అని నమోదు చేసి దౌర్జన్యం ప్రదర్శించారని ఆక్షేపించారు. అధికారం ఉంది కదా అని అహంభావంతో ప్రవర్తించారని ఆక్షేపించారు. 2019-24 మధ్య ప్రణాళికా బద్ధంగా హిందూమతంపై దాడి జరిగిందని ఆరోపించారు. మొత్తం 2032 దేవాలయాలపై దాడి జరిగిందని…విగ్రహాలను ధ్వంసం చేశారని వేటిపైనా కేసు పెట్టి సరైన విచారణ చేయలేదన్నారు. రామతీర్ధం, అంతర్వేది రధం, దుర్గగుడి వెండి సింహాల చోరీ లాంటి ఘటనలు చాలా జరిగినా నిందితులపై ఎలాంటి చర్యలూ లేవన్నారు. కూటమి హయాంలో దేవాలయాలపై దాడులకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తిరుమలలో జరిగిన ఈ వ్యవహారాలపై హిందూ మఠాలు, పీఠాధిపతుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయన్నారు.
ap cm thown ycp : కూటమి వచ్చాకే టీటీడీ ప్రక్షాళన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే టీటీడీలో ప్రక్షాళనా చర్యలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాద నాణ్యతను పెంచామని… ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ధృవీకరణ తర్వాతే లడ్డూ తయారీకి వినియోగించే పదార్ధాలు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.భక్తులకు వడ్డించే అన్న ప్రసాద పాత దిట్టాన్ని తిరిగి అమల్లోకి తీసుకువచ్చామని… నాణ్యత, రుచి కూడా పెరిగాయని.. 98 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం శాసనసభలో వివరించారు. పీఏసీ 5 వెంకటాద్రి నిలయం వద్ద ఆధునిక వసతులతో వంటశాల అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
భక్తులకు కేటాయించే గదులు, కాటేజీలను కేంద్రీకృతం చేసి దర్శనాలతో అనుసంధానించామని వివరించారు. బ్రేక్ దర్శనాలను కూడా నియంత్రించి సాధారణ భక్తుల దర్శన సమయం పెంచామన్నారు. రద్దీ నియంత్రణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ ఈ క్యూ మేనేజ్మెంట్ సిస్టం అమలు చేస్తామని చెప్పారు. దేశీయంగా 200 దేవాలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి లాంటి పర్వదినాల్లో తరలివచ్చిన లక్షల మంది భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. 60 టీటీడీ దేవాలయాల్లో రూ.700కోట్లతో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తిరుమలలో గ్రీన్ కవర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని 3.5 ఎకరాల్లో దివ్య ఔషధ వనం ప్రాజెక్టు కూడా త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. అన్నదాన, ప్రాణదాన కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. శ్రీవారి సేవకుల కార్యక్రమం ద్వారా వైద్యులు కూడా సేవలందించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల దేవాలయాలను నిర్మించేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు.
ap cm thown ycp : హెరిటేజ్ నీతి నిజాయితీతో నిలబడింది

కుటుంబ వ్యాపార సంస్థగా ఉన్న హెరిటేజ్ ప్రభుత్వంతో ఎక్కడా ఒప్పందాలు చేసుకుని ఉత్పత్తులు విక్రయించలేదని సీఎం స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ శాఖ హెరిటేజ్ నుంచి ఒక్క కిలో నెయ్యి కూడా కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండానే నీతి నిజాయితీతో హెరిటేజ్ నిలబడిందని శాసనసభలో వివరించారు. అయినా సాక్షి పత్రికలో ఇష్టానుసారంగా కథనాలు రాశారన్నారు. నేరస్తులు ఏ విధంగా సంస్థల క్రెడిబిలిటీని దెబ్బతీస్తారు అనటానికి ఈ రాతలే పెద్ద ఉదాహరణ అన్నారు. గత పాలనలో భారతీ సిమెంట్స్ నుంచి హౌసింగ్ పథకాలు, ప్రాజెక్టుల్లో సిమెంట్ కొనుగోలు చేశారని దీనిపై తామేమి మాట్లాడ లేదని అన్నారు.

నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీతో ముడిపెట్టే ప్రయత్నం చేశారని సీఎం ఆక్షేపించారు. రోజూ 20 లక్షల లీటర్ల పాలు సేకరించి విక్రయిస్తున్న హెరిటేజ్ నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తోందని తెలిపారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు నెయ్యి విషయంలో అసలు సంబంధమే లేదని వివరించారు. పూణేలో ఉన్న ఇందాపూర్ డెయిరీ ప్రసిద్ధ కంపెనీలన్నిటికీ కో మాన్యుఫాక్చరింగ్ చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. మదర్ డెయిరీ, బ్రిటానియా, ఆయుర్వేద ఘీ పతంజలి, డిమార్ట్, రిలయన్స్, దొడ్ల, హాడ్సన్ , జీఆర్బీ, అముల్, హెరిటేజ్ ప్రముఖ సంస్థలకు ఉత్పత్తుల కో మాన్యుఫాక్చరింగ్ చేస్తోందన్నారు. రాజమహేంద్రవరంలో పాల కల్తీ ఘటన జరిగితే దానిపై చర్చించకుండా మండలిలో అడ్డుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్టీఏ ప్రభుత్వం ఈ ఘటనపై చర్చించి తగిన చర్యలు చేపట్టిందని తెలిపారు. గత పాలకులు చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలని… దేవాలయాల పవిత్రతను దెబ్ప తీయవద్దని సీఎం హితవు పలికారు. తప్పుచేసిన వ్యక్తులే తమను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హైందవ ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానన్నారు. వేర్వేరు మతాలకు చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే అధికారం మరొకరికి లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ALSO READ : cbn bc spark : బీసీకి కత్తికి సాన Amdhra Prabha insight Story
