ap cm intention : తెలుగుజాతి నెంబర్-1 లక్ష్యం

ap cm intention : తెలుగుజాతి నెంబర్-1 లక్ష్యం
- అభివృద్ధి పథంలో ఏపీ
- పుఫ్కరాలకు ముందే పోలవరం జాతికి అంకితం
- టెక్నాలజీతో భవిష్యత్ పాలన
- ఉద్యోగాల కల్పనపై కీలక ప్రకటన
- సంక్షేమ పథకాలపై సీఎం వివరణ
- పంచాంగ శ్రవణం ప్రత్యేకత
- ఉగాది పురస్కారాల ప్రదానం
- పంచాంగాలను ఆవిష్కరించిన సీఎం
(ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)

స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నిలుపుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు.

ఉగాది పచ్చడి ప్రసాదాన్ని సేవించిన అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాంగ శ్రవణం చేశారు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ap cm intention : ఉగాది పచ్చడే.. మన జీవితం

ఉగాది పచ్చడి మన జీవితాలను ప్రతిబింబిస్తుందని.. షడ్రుచుల తరహాలోనే జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. పండుగలు ఆరోగ్య కరమైన జీవనశైలిని నేర్పుతాయన్నారు. పండుగలు, ఆచారాల్లోనే సైన్సు ఉందని…వాస్తు లాంటి శాస్త్రాలు, సూర్య నమస్కారం లాంటి ఆచారాలు ఇలాంటి వేనని సీఎం అన్నారు. యోగా, నేచురోపతి లాంటి వైద్యం కూడా ప్రకృతి నుంచి వచ్చిందేనని…ఆరోగ్యం, ఆనందం, సంపద వీటి వల్లే సాధ్యం అవుతుందన్నారు. నేలను, ప్రకృతిని, నీటిని ఆరాధిస్తామని.. దానిని అందిపుచ్చుకుని నీటిని పరిరక్షించేలా నీటి భద్రత విధానాన్ని తీసుకువచ్చామన్నారు. తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేలా నీటి యాజమాన్యం చేస్తున్నట్టు వివరించారు.
ap cm intention మే 15 నాటికి నారు మళ్లు వేయండి

ప్రస్తుతం వేసవి వచ్చినా రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 65 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. అందుకే మే 15 నాటికే నారుమళ్లు వేసుకోవాలని ముందుగానే ప్రకటించిన ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యమంత్రిగా మూడో మారు గోదావరి పుష్కరాలను నిర్వహించే గౌరవం తనకు దక్కిందని .. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఇప్పటి వరకూ రూ.1943 కోట్ల రూపాయలు ఇచ్చామని.. గత పాలకులు పైసా కూడా వారికి ఇవ్వలేదన్నారు. అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలని..గోదావరి పుష్కరాలకంటే ముందు ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. కృష్ణా డెల్టాకు, విశాఖకు గ్రావిటీతో నీళ్లు వెళ్తే..రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇంకా రూ.5 వేల కోట్ల మేర నిధులు వ్యయం చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు అందిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
ap cm intention తెలుగువారే బ్రాండ్ అంబాసిడర్లు

సమీప భవిష్యత్తులో పూర్తిస్థాయి సాంకేతికతతో పాలన జరిగే అవకాశం ఉంటుందని, వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు ఇలా వేర్వేరు పరిస్థితులు అప్పటికప్పుడు అధ్యయనం చేసి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చేసిందన్నారు. 30 ఏళ్ల క్రితమే తాను ఐటీ విప్లవాన్ని ఊహించి టెక్నాలజీని ప్రోత్సహించానని తద్వారా చాలా మంది జీవితాల్లో మార్పు వచ్చిందని అన్నారు.

నాడు తీసుకున్న నిర్ణయంతోనే హైదరాబాద్ ఇప్పుడు నాలెడ్జి ఎకానమీగా ఎదిగిందన్నారు. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్ల గురించి చర్చిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలు నేర్వే విలువలను గౌరవించాలని.. ఇక్కడ ఉండే మనకంటే విదేశాల్లోని ప్రవాస తెలుగు వారు వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారన్నారు. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టటమే తన సంకల్పమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంజీవని ప్రాజెక్టు ద్వారా ముఖ్యమైన ముందడుగు వేశామన్నారు.
ap cm intention 2024 వరకూ.. అంతా విద్వంసం

2024 కంటే ముందు ఎవరూ సంతోషంగా పండుగలు జరుపుకునే పరిస్థితి లేదని.. ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసం, దారుణాలు జరిగాయని ఆక్షేపించారు. మన దేశంలో ఉమ్మడిగా అంతా కలిసి ఉండే సంప్రదాయం ఉందని.. కొందరు స్వార్ధంతో తల్లికి, చెల్లెలికి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు కూడా ఉన్నారని సీఎం అన్నారు.

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గా ఏర్పడి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తు్న్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య భద్రత అందించాలన్నది లక్ష్యమని తెలిపారు. పాపులేషన్ మేనేజీమెంట్ పాలసీతో మళ్లీ మన జనాభా పెంచేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఇందులో భాగంగానే తల్లికి వందనం ద్వారా ఎంతమంది ఉన్నా ఆర్ధిక సహకారం అందిస్తున్నట్టు వివరించారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులను, స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకూ 56 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు. దివ్యాంగశక్తి ద్వారా దివ్యాంగులకు ఉచిత ప్రయాణంతో ఆత్మగౌరవాన్ని కల్పించటంతో పాటు డబ్బులు ఆదా అయ్యేలా చేస్తున్నామని వివరించారు. అర్చకులకు రూ.15 వేల వేతనం ఇవ్వటంతో పాటు ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.
ap cm intention అగ్రస్థానంలో ఏపీ

సమాజంలో అట్టడుగున ఉండిపోయిన వారిని పేదరికం నుంచి బయటపడేసేలా జీరో పావర్టీ కార్యక్రమం పీ4 చేపట్టామని అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేలా దీనిని అమలు చేస్తున్నట్టు వివరించారు. సమాజంలో సంపన్నులైన 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం మందిని ఆదుకునేలా పీ4 చేపట్టామని తెలిపారు. తాను పనిచేసేది 5 కోట్ల మంది రాష్ట్రప్రజల కోసమని.. అందరి జీవన ప్రమాణాలు మెరుగుపర్చటం కోసమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్టరంలో సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ప్రాంతీయ ఎకనామిక్ కారిడార్లు తీసుకువచ్చామని అన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైల్వేలైన్లు అనుసంధానం చేసి లాజిస్టిక్స్ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్టు వివరించారు. ప్రజా రాజధాని అమరావతి అద్భుతంగా అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు చేశామని ముఖ్యమంత్రి తెలియచేశారు. తాను అందరివాడిగా ఉండాలని కోరుకుంటున్నానని కొందరు దుష్టులు ఏమార్చే కుట్రలు చేస్తారని వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు.

కూటమి ప్రభుత్వం యువతకు హామీ ఇచ్చినట్టుగానే 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంకల్పం చేశామన్నారు. ఉగాది సందర్భంగా 10,060 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ జారీ చేశామని తెలిపారు. మే 15 నుంచి అక్టోబరు వరకూ వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. గత 21 నెలల్లో 15,940 మంది టీచర్లకు మెగాడీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, 5757 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలు చేశామన్నారు.

ఇప్పటి వరకూ 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇక ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. కంజ్యూమర్ జస్టిస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఓ నివేదిక వచ్చిందని.. వినియోగదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందంజలో ఉందన్నారు. 2047 నాటికి వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీ మారాలంటే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరాభవ నామ సంవత్సరంలో తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిచెప్పేలా సంకల్పం చేద్దామని సీఎం పిలుపునిచ్చారు.
ఆర్ధిక ప్రగతి- సుఖ శాంతి : మాడుగుల నాగఫణిశర్మ

ఉగాది పర్వదినం సందర్భంగా మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం సంకల్పించిన ప్రతీదీ ఫలిస్తుందని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఏ రంగంలో ఉన్నా అగ్రస్థానంలో ఉండాలన్న ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరుతుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యంగా ప్రజాహితంతో ముందడుగులు వేస్తాయని వెల్లడించారు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంటుందని.. అందుకే ఉగాదికి ముందుగానే కురిసిన వర్షం దీనికి సూచిక అని తెలిపారు.ప్రత్యేకంగా ఈ ఏడాది సాంస్కృతిక చైతన్యం కలుగుతుందని వివరించారు.

అమరావతి విశ్వనగరిగా ఎదుగుతుందని.. రాష్ట్రానికి ప్రభుత్వానికి ఆర్ధిక ప్రగతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా సుఖ శాంతులతో ఉంటారని వివరించారు. పంచాంగ పఠనం చేసిన మాడుగుల నాగఫణి శర్మను సీఎం నూతన వస్త్రాలతో సత్కరించారు. అనంతరం టీటీడీ పంచాంగం, వ్యవసాయ పంచాంగంతో పాటు సాంస్కృతిక శాఖ క్యాలండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందించారు. సాహిత్యం, సంగీతం, కళలు, సామాజిక సేవ రంగాల్లో ఉగాది కళారత్న పురస్కారాలను సీఎం అందించారు. 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. వివిధ దేవాలయాలకు చెందిన పురోహితులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ALSO READ ; 38000 MT Gas Available : ఏపీలో గ్యాస్ కొరత లేదు Andhra Prabha News
