టిడిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్
ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాల్సింది మీరే
పని తీరు మెరుగు పరుచుకుంటే మరిన్ని అవకాశాలు
వెలగపూడి – కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని.. ఎమ్మెల్యేలు అందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్నిపెంచే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని కోరారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలతో అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సందర్భంగా జూన్ 12వ తేదీన అమరావతిలో రెండు వేలమందితో ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత కూడా ఏపీవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏం చేస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో ఉన్న పరిస్థితులు కూడా ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2024 జూన్‌కి ముందు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని గుర్తుచేశారు. తాను నాలుగోసారి సీఎం అయ్యానని.. కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని వెల్లడించారు సీఎం .
ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాం..
ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. మనం రాష్ట్ర సంక్షేమం కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు కొంతమంది భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో గతంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యం అయ్యేదని.. ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నామని అన్నారు. శాంతి భద్రతలు, గంజాయి, రౌడీయిజాన్ని నిర్ధాక్షిణ్యంగా అణచి వేస్తామని.. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహానాడు ఈసారి బాగా జరిగిందని చెప్పారు. వచ్చే నెల నాటికి అన్ని కమిటీలు, రాష్ట్ర కమిటీలను నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. యోగా డేను జయప్రదం చేయాలని కోరారు. కార్యకర్తలు యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎఐలో ఎపిని నెంబర్ వన్ చేస్తాం ..
ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశానికి మార్గదర్శకంగా నిలపాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ఈ దిశగా, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో, ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఎన్విడియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఏఐ ఆధారిత అభివృద్ధికి పటిష్టమైన పునాది వేస్తున్నామని. విద్య, నైపుణ్యాభివృద్ధి నుంచి పరిశోధన, ఆవిష్కరణల వరకు ప్రతి అంశంలోనూ ఈ భాగస్వామ్యం కీలకం కానుందని స్పష్టం చేశారు.