AP | వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం !

తుగ్గలి, (ఆంధ్రప్రభ): ఆదివారం రాత్రి భారీగా వర్షం పడడంతో తుగ్గలి మండల పరిధిలోని గిరిగేట్ల గ్రామ సమీపంలో అమీనాబాద్ గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జి భారీ వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలోని రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

దీని కార‌ణంగా పగిడిరాయి, చెన్నంపల్లి, కొత్తూరు, కడమకుంట్ల, అమీనాబాద్ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణికులు మరింత ఇబ్బందులను అనుభవిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించాల్సిన వారు దాదాపు 15 కిలోమీటర్లు జొన్నగిరి ద్వారా లేదా 20 కిలోమీటర్లు ఎద్దులదొడ్డి ద్వారా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ సమస్యపై ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.

బ్రిడ్జి పునర్నిర్మాణం తక్షణమే చేపట్టకపోతే పలు గ్రామాల ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply