నరసరావుపేట!: బర్డ్‌ఫ్లూ తో పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మరణించింది. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
వివరాలలోకి వెళితే, నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. చిన్నారి ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని పరిస్థితి ఎదురైంది. పాపను మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్కు తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించినప్పటికీ లాభం లేకపోయింది. మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి స్వాబ్ నమూనాలు తీసుకున్నారు. ఎయిమ్స్లోని వీఆర్డీఎల్లో పరీక్షించగా ఇన్ఫ్లుయెంజా ఎ పాజిటివ్గా తేలింది. అనంతరం మార్చి 15న మరోసారి శాంపిల్ను స్వీకరించి ఢిల్లీలో పరీక్షించారు. మార్చి 16న పాప చనిపోగా.. ఐసీఎంఆర్ అప్రమత్తమైంది. మార్చి 24న స్వాబ్ నమూనాలను పుణెలోని ఎన్ఐవీ కి పంపించగా.. అక్కడ హెచ్5ఎన్1 వైరస్గా తేల్చారు.
వైద్యారోగ్య శాఖ అధికారులు చిన్నారి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాలిక పెంపుడు కుక్కలు, వీధి కుక్కలతో ఆడుకునేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాపకు ఫిబ్రవరి 28న జ్వరం వచ్చిందని.. అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు చిన్నారి తల్లి వివరించింది. చికెన్ ని కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇచ్చినట్లు..దానిని తిన్న తర్వాతే జబ్బు పడింది అన్నారు.
గతంలోనూ ఓసారి ఇలాగే ఇచ్చామని.. ఉడికించిన మాంసం తిన్న తమకెవరికీ ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు.పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబం ఇంటికి కిలోమీటరు దూరంలో మాంసం దుకాణం ఉందని గుర్తించారు. చిన్నారి ఇంటి దగ్గర వైద్య ఆరోగ్యశాఖ జ్వర సర్వే నిర్వహించింది. అనుమానిత లక్షణాలున్న వారు ఎవరూ లేరని తేల్చింది. ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక అధికారి నరసరావుపేటకు వెళ్లి కుటుంబ సభ్యులను, స్థానికులను ప్రశ్నించారు.