AP | 15 కొత్త ప్రాజెక్ట్ లకు ఆమోదముద్ర.. చంద్రబాబు
- వాటి ద్వారా రూ. 44,776 కోట్ల పెట్టుబడులు
- ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన
- మూడు నెలల్లో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్,
- బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
- పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్
- దావోస్‌లో ఆసక్తి చూపిన డీపీ వరల్డ్,
- ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరపాలి
- స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు సమావేశంలో చంద్రబాబు వెల్లడి
అమరావతి, ఆంధ్రప్రభ : 15 కొత్త ప్రాజెక్ట్ లకు ఏపీ స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ఆమోదముద్ర వేసింది.. ఈ ప్రాజెక్ట్ ల విలువ రూ.47, 776 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ల ద్వారా మొత్తంగా 20వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.. అమరావతిలోని సచివాలయంలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) 3వ సమావేశం నిర్వహించారు.. దీనిలో ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్ట్ లు, రాబోయే సంస్థల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.. త్వరలోనే ల్యాండింగ్ కానున్న 15 ప్రాజెక్ట్ ల వివరాలను అధికారులు చంద్రబాబుకు అందజేశారు.. వాటన్నింటికి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఎస్ఐపిబీ ఇప్పటివరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ రూ.3లక్షల కోట్లు దాటాయి. వీటితో పాటు అర్సెల్లార్ మిట్టల్, ఎన్టిపిసి, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ వంటి సంస్థలు పెట్టుబడులకు ఇప్పటికే లైన్‌క్లియర్ అయ్యింది. రూ. 1.36 లక్షల కోట్లతో ఏర్పాటయ్యే అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు, రూ. 96,000 కోట్లతో ఏర్పాటయ్యే బిపిసిఎల్ వంటి ప్రాజెక్టులకు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టులను గ్రౌండ్ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
7 నెలల్లో మూడుసార్లు ఎస్‌ఐపిబి సమావేశం :
రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 7 నెలల కాలంలో తీసుకువచ్చిన పాలసీలు, అందిస్తున్న సహకారంతో పెట్టుబడుల రాక ఆశాజనకంగా సాగుతోంది. మొదటి ఎస్ఐపిబి సమావేశంలో రూ. 83,987 కోట్లు, రెండో ఎస్ఐపిబిలో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈరోజు జరిగిన మూడవ ఎస్ఐపిబి సమావేశంలో మరో రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. నేడు ఆమోదం పొందిన 15 ప్రాజెక్టుల ద్వారా రూ.19,580 మందికి ఉపాధి లభిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రూ.3,10,925 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 3,12,576 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
ప్రాజెక్టుల పురోగతిపైనా సమీక్ష :
పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని సిఎం సమావేశంలో అధికారులకు సూచించారు. రూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా ట్రాకింగ్ చేయాలని సిఎం ఆదేశించారు. గత రెండు ఎస్‌ఐపిబి సమావేశాల్లో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల పురోగతి పైనా ఈ రోజు చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సిఎం సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సిఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష జరపాలని ప్రధాన కార్యదర్శికి సిఎం సూచించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థలు, జాతీయ-అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని అన్నారు. దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన దుబాయ్‌కు చెందిన డిపి వరల్డ్, డెన్మార్క్‌కు చెందిన ఎపి ముల్లర్-మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి, సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలన్నారు. పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని… ఈ రంగంలో 20 శాతం వృద్ధి సాధించాలని చెప్పారు.
తాజా పెట్టుబడుల వివరాలు :
ఎస్ఐపిబి మూడో సమావేశంలో ఆమోదం తెలిపిన 15 ప్రాజెక్టులు.. పునరుత్పాదక విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రానున్నాయి.
నవయుగ ఇంజినీరింగ్ :
అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలిలో 1,500 మెగావాట్లతో, చిత్తంవలసలో 800 మెగావాట్ల ప్రాజెక్టును నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ రూ. 14,328 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. 3,450 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మేఘా ఇంజినీరింగ్ :
అన్నమయ్య జిల్లాలో కొమ్మూరులో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ. 10,300 కోట్లతో 3,000 మందికి ఉపాధి కలిగేలా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నెలకొల్పనుంది.
యాస్పరి :
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 118.80 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు యాస్పరి రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసక్తి కనబరించింది. ఈ ప్రాజెక్టు రాకతో 150 మందికి ఉపాధి లభిస్తుంది.
అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ :
అనంతపురంలో 178.20 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 972.23 కోట్లతో 225 మందికి ఉపాధి కలిగించేలా ఏర్పాటు చేయనుంది.
కడప రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ :
శ్రీసత్య సాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1,163.11 కోట్లతో 300 మందికి ఉపాధి కలిగేలా 231 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పనుంది.
ఎకోరెన్ ఎనర్జీ ఇండియా :
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ 201.30 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును రూ. 1,651 కోట్లతో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 255 మందికి ఉపాధి కలుగుతుంది.
అయానా పవర్ : ఎకోరెన్ లిమిటెడ్ నుంచి అయానా రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 4,435 కోట్లతో కర్నూలు జిల్లాలో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. 498.30 మెగావాట్ల సామర్ధ్యంతో నెలకొల్పే ఈ పవర్ ప్లాంటుతో 630 మందికి ఉపాధి దక్కనుంది.
ఆంపిన్ ఎనర్జీ :
ఎకోరెన్ లిమిటెడ్ నుంచి ఆంపిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు, నంద్యాలలో రూ. 3,142 కోట్లతో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న పవన-సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. 1,200 మందికి ఉపాధి కలుగుతుంది.
ఎస్ఏఈఎల్ :
ఒకొక్కటి 300 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఎస్ఏఈఎల్ సోలార్ ఏర్పాటు చేస్తోంది. రూ. 3,456 కోట్లతో 2,070 మందికి ఉపాధి కలిగేలా అనంతపురం, కడప, నంద్యాలలో ఈ ప్లాంట్లను నెలకొల్పనుంది.
టాటా పవర్ :
అనంతపురంలో 400 మెగావాట్ల సామర్ధ్యంతో రూ. 2,000 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ కేంద్రం ద్వారా 1,380 మందికి ఉపాధి లభిస్తుంది.
ఎన్ఎస్ఎల్ రెన్యూవబుల్ సీపీపీ :
ఎకోరెన్ నుంచి ఎన్ఎస్ఎల్ రెన్యూవబుల్ సీపీపీ ప్రైవేట్ లిమిటెడ్ 50 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన విండ్, సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనికి రూ. 567 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 170 మందికి ఉపాధి కలుగుతుంది.
కోరమండల్ :
కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ రూ. 1,539 కోట్లతో కాకినాడ జిల్లాలో తమ ఫెర్టిలైజర్ ప్లాంటును విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్లాంటు ఏర్పాటు ద్వారా 750 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.
అలెప్, ఈఎంసీ కొప్పర్తి :
కోడూరులో 6 వేల మందికి ఉపాధి కల్పించేలా రూ.305 కోట్లతో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (అలెప్) ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. అలాగే ఈఎంసీ కొప్పర్తి కడప జిల్లాలో కూడా ఇదే రంగంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న సంస్థల్ని సమన్వయం చేసుకుంటూ, త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చేసేందుకు కన్వీనర్‌ను నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్రంలో పైస్థాయి అధికారుల వరకు త్వరగా అనుమతులు వచ్చేలా, క్షేత్రస్థాయిలో తలెత్తే అవరోధాలను అధిగమించేలా కన్వీనర్‌కు బాధ్యత అప్పగించాలని అన్నారు.