- ప్రతినెల 1వ తేదీన పింఛన్లు అందజేస్తున్నాం
- గత ప్రభుత్వ హయాంలో సకాలంలో జీతాలు, పింఛన్లు ఇవ్వేలేదు
- ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తున్నం
- రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించేందుకు సంకల్పబద్ధంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ‘పేదల సేవలో’ పేరుతో ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రతి నెల మొదటిరోజునే పింఛన్లు అందజేయడం ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో జీతాలు, పింఛన్లు అందని పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడీ విధానం పూర్తిగా మారిందని స్పష్టం చేశారు.
ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో తాను ఎన్నడూ చూడని విధ్వంసం జరిగిందని మండిపడ్డ చంద్రబాబు, ఇప్పుడు తమ ప్రభుత్వం దాన్ని దాటి వికాస దిశగా నడుస్తోందని చెప్పారు. ‘సూపర్ సిక్స్’ పథకాల అమలుతోపాటు, అభివృద్ధికి కేంద్రబిందువుగా పని చేస్తున్నామని చెప్పారు.
దివ్యాంగుల పింఛన్లు 12 రెట్లు పెంచామని, అప్పట్లో రూ.500 నుండి రూ.3000 కు పెంచాము. గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. మేము అధికారంలోకి వచ్చాక దానిని రూ.3000 నుండి రూ.6000 కు పెంచామని గుర్తు చేశారు.
మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రగ్స్ విక్రయించే వారిని, మహిళలపై దాడి చేసేవారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘‘ఆడబిడ్డపై చేయివేస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది,’’ అని చంద్రబాబు కఠినంగా హెచ్చరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు వివరించారు.
రాష్ట్రాభివృద్ధికి బాటలు:
పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అది పూర్తిగా అస్తవ్యస్తమైపోయిందని ఆరోపించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడం తనకు లభించిన అదృష్టమని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేస్తామన్నారు. గోదావరి పుష్కరాలు మూడోసారి తానే నిర్వహించనున్నట్లు, అవి అపూర్వంగా ఉండబోతున్నాయని హామీ ఇచ్చారు.
సాంకేతిక వేదికగా గవర్నెన్స్:
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆగస్టు 15 నాటికి 100 శాతం ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అంతేగాక, ఈ ఏడాది తలసరి ఆదాయం రూ.30,000 పెరిగిందని, ఇది రాష్ట్ర పురోగతికి సంకేతమని అన్నారు.
నెలలోపే డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగ యువతకు ఆశనిచ్చారు. అలాగే, ఎన్డీయే కార్యకర్తలు పింఛన్ల పంపిణీలో వ్యక్తిగతంగా పాల్గొని మరీ పరిశీలించాలంటూ స్పష్టం చేశారు.