AP | ఎన్‌జీజీఓ రాష్ట్ర సంఘ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

AP | ఎన్‌జీజీఓ రాష్ట్ర సంఘ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

  • ఫిబ్రవరి 8న నామినేషన్ల స్వీకరణ
  • 27న ఎన్నికలు: ఎన్నికల అధికారి ఆచంట రామారాయుడు

AP | విజయవాడ,ఆంధ్రప్రభ : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్‌జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర సంఘ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎన్నికల అధికారి, సంఘ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆచంట రామారాయుడు తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 8వ తేదీన నామినేషన్లను స్వీకరిస్తామని, అవసరమైతే ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 75 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్‌జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర సంఘానికి సంబంధించి ఈ ఎన్నికల్లోఒక అధ్యక్షుడు, ఒక సహా అధ్యక్షుడు, 12 మంది ఉపాధ్యక్షులు, ఒక మహిళా ఉపాధ్యక్షురాలు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కార్యనిర్వహణ కార్యదర్శి, ఒక ప్రచార కార్యదర్శి, ఐదుగురు కార్యదర్శులు, ఒక మహిళా కార్యదర్శి పోస్టులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన ఏపీ ఎన్‌జీజీఓ రాష్ట్ర సంఘ కార్యాలయంలో ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఏపీ ఎన్‌జీజీఓ హోమ్‌లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లను పరిశీలించి అర్హత గల అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించామని, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. ఒక్కో పోస్టుకు ఒకరికి మించి అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించి విజేతలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు ఒక్కో పోస్టుకు ప్రతి నామినేషన్‌కు రూ.1000 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందని, ఈ రుసుము తిరిగి ఇవ్వబడదని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియకు సహాయ ఎన్నికల అధికారిగా ఆర్. ల్యూకు, ఎన్నికల పరిశీలకుడిగా సంఘ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చి. పురుషోత్తమ నాయుడు వ్యవహరిస్తారని ఆచంట రామారాయుడు తెలిపారు. ఏపీ ఎన్‌జీజీఓ రాష్ట్ర సంఘ ఎన్నికలు ఉద్యోగ సంఘాల భవిష్యత్తు దిశను నిర్ణయించే కీలక ఘట్టమని, సభ్యులంతా చురుగ్గా పాల్గొని ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply