జాతీయ ఇండోర్ రోయింగ్ పోటీలకు ఏపీ జట్టు సిద్ధం..

జాతీయ ఇండోర్ రోయింగ్ పోటీలకు ఏపీ జట్టు సిద్ధం..
ప్రతిభావంతుల ఎంపిక..
జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ పూర్తి
కటక్‌లో జరగనున్న జాతీయ పోటీలు
అన్ని విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక
మెరుగైన ఫలితాలపై క్రీడా వర్గాల ఆశాభావం
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆల్ ఇండియా నేషనల్ ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు ఎంపిక పూర్తయింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఖేలో ఇండియా దక్షిణ మండల సభ్యుడు, అమరావతి బోటింగ్ క్లబ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి డాక్టర్ తరుణ్ కకాని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17 నుంచి 26 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎంపికల ద్వారా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసినట్లు తెలిపారు.
జాతీయ స్థాయి ఇండోర్ రోయింగ్ పోటీలు ఒడిశా రాష్ట్రంలోని కటక్ పట్టణంలో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ క్రీడాంగణంలో నిర్వహించబడనున్నాయి. ఈ పోటీలలో వివిధ వయో విభాగాల్లో రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొననున్నారు.
ఈ క్రమంలో 15 సంవత్సరాల లోపు విభాగంలో గువ్వాడి పార్థు, బోర వైషాంత్, బండం రాకేష్ ఎంపికయ్యారు. 17 సంవత్సరాల లోపు విభాగంలో గొల్లపెల్లి శ్రీకర్, గువ్వాడి హిమజ చోటు దక్కించుకున్నారు. 19 సంవత్సరాల లోపు విభాగంలో చీపుల్ల రూపా శ్రీ ఎంపిక కాగా, ఓపెన్ విభాగంలో ఉదార్ల విజయ్, వాసిరెడ్డి గిరి రాజశేఖర్, చి. శ్యామ్ శ్రీ గణేష్ జట్టులో స్థానం సంపాదించారు. ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసి రాష్ట్రానికి మంచి ఫలితాలు తీసుకురావాలని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తగిన శిక్షణతో వీరందరిలో మంచి ప్రతిభ ఉందని కోచ్‌లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహణాధికారి భరణి, సంస్థ ఛైర్మన్ రవినాయుడు డాక్టర్ తరుణ్ కకాని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనే ఈ జట్టుకు రాష్ట్ర ప్రజలు, క్రీడాభిమానులు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు.
