మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం..

మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం..
వారి త్యాగాల ఫలాలను సద్వినియోగం చేసుకుంటూ అడుగేద్దాం
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
కలెక్టరేట్‌లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
ఆంధ్రప్రభ, విజయవాడ : శ్రీ బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల త్యాగాలు, ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని.. దేశ అభివృద్ధికి వారు చేసిన త్యాగాల ఫలాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతిఒక్కరూ బాధ్యతతో ముందడుగు వేసి.. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. వివిధ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్‌టీ సంఘాల నేతలు, డీవీఎంసీ సభ్యులు తదితరులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల జీవిత చరిత్రను సరైన విధంగా అర్థం చేసుకుంటూ చిన్నారులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకోవాలన్నారు. అదేవిధంగా తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా మరో పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిని సొంతం చేసుకునేందుకు పారిశ్రామిక యూనిట్లు స్థాపించి, విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. మహనీయుల త్యాగాల వల్ల నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సౌకర్యాలు, హక్కులను సద్వినియోగం చేసుకుంటూ దేశాభివృద్దిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కేఎల్ హర్షిత, లిడ్ క్యాప్ డైరెక్టర్ పి.ఏసురత్నం, డీఐసీసీఐ ఏపీ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజమణితో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమ సంఘాలు, కమిటీల నేతలు కండెల వరప్రసాద్, డా. దేవరాజ్, కేవీ నరసింహారావు, దువ్వూరి సుబ్బారావు, దువ్వూరి బాబురావు, పి.రమేష్, ఏఎస్‌డబ్ల్యూవో వీఎస్ఎస్ గణేష్ బాబు, సూపరింటెండెంట్ ఎన్.బాబురావు తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారి బహుముఖ సేవల గురించి మాట్లాడి, చిన్నారుల్లో స్ఫూర్తిని నింపారు.
