సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం

సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం
- చిత్తూరులో ఎన్టీఆర్ పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లు చెప్పారు. బుధవారం చిత్తూరు నగరపాలక పరిధిలో 35వ వార్డు కయనికట్టు వీధిలో కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు.. ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులకు పింఛన్ సొమ్ములను అందించారు. పింఛను సొమ్ములు ఎంత వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారో తెలుసా అంటూ లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4 వేలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 2,38,880 మందికి రూ.100.53 కోట్ల రూపాయల పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. చిత్తూరు నగరపాలక పరిధిలో 16,032 మందికి రూ.7.11 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.
కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహ ప్రసాద్, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మాజీ మేయర్ ఎస్ అముద, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, సహాయ కమిషనర్ అవినేని ప్రసాద్, ఎంహెచ్వో డా లోకేష్, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, తెదేపా నగర కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
