ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం..

ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం..

శ్రీదుర్గాతత్త్వం ప్రవచనంతో భక్తుల్లో భక్తిరస ప్రవాహం
వసంత నవరాత్రుల సందర్బంగా..
కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రవచన వైభవం
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ మధుర వచనాలతో భక్తుల మంత్రముగ్ధత

ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రుల ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉజ్వలంగా మారింది. సోమవారం మహామండపంలోని కళావేదికపై జరిగిన ‘శ్రీదుర్గాతత్త్వం’ ప్రవచనం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లింది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ఉపన్యాసం భక్తుల్లో విశేష స్పందన రేకెత్తించింది. వసంత నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక కాంతి పరచుకుంది. సోమవారం మహామండపం 7వ అంతస్తులోని కళావేదికపై నిర్వహించిన ‘శ్రీదుర్గాతత్త్వం’ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా త్రిభాషా మహా సహస్రావధాని, ప్రణవపీఠాధీశులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అమ్మవారి మహిమను, శక్తిని మధుర వచనాలతో వివరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించారు.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అమ్మవారు ఎత్తిన వివిధ అవతారాల వెనుక ఉన్న తాత్త్వికతను సుస్పష్టంగా వివరించారు. లోకపావని అయిన కనకదుర్గమ్మను స్మరించడం ద్వారా కలిగే మానసిక ప్రశాంతత, లలితా సహస్రనామ మహిమను శ్లోక రూపంలో విశ్లేషించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రవచనాన్ని వినేందుకు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శ్రీనా నాయక్ పాల్గొని పద్మాకర్ దంపతులను ఘనంగా సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. అలాగే ధర్మకర్తలు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవ రాజు, స్థానాచార్య వి. శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply