ఉగాది మహోత్సవములు ఘనంగాప్రారంభం..

ఉగాది మహోత్సవములు ఘనంగాప్రారంభం..
నేటి నుండి 20 వ తేది వరకు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో సోమవారం నుంచి ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్య నిర్వాహణా అధికారి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిపించబడ్డాయన్నారు. దేవాలయమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి సమయ ప్రత్యేక వెలుగులు కనపడేలా విద్యుత్ అలంకరణ చేయడం విశేషం. ఈ సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి.

యాగశాల ప్రవేశం… ఉగాది ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి స్థానాచార్యులు అధ్యాపక, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలో స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.ఆలయప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు. వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యులు అధ్యాపక , అర్చకస్వాములు, వేదపండితులు, లోకక్షేమాన్నికాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు.
దీనికే శివసంకల్పం అని పేరుపెట్టారు. ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించ కుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు. సంకల్పపఠనం తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడిందన్నారు.

గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం జరిపించబడింది. వృద్ధి మరియు అభ్యుదయాల కోసం ఈ పుణ్యహవచనం జరిపించబడుతుందన్నారు . సంకల్పపఠనం తరువాత చండీశ్వరపూజ జరిపించబడింది. ఈ ఉత్సవాలు క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో నిర్వహించబడుతాయన్నారు. యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజాదికాలు జరపించడం సంప్రదాయం గా ఉందన్నారు. కంకణ పూజ, కంకణధారణ… చండీశ్వరపూజ తరువాత కంకణాలకు రక్షాబంధనాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించబడ్డాయన్నారు . తరువాత అధికారులు, అర్చకస్వాములు కంకణాలను ధరించారు.

కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించబడిందన్నారు. ఉత్సవాలలో ఆయా వైదిక కార్యక్రమాలు నిర్వహించమని ఋత్విక్కులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు వచ్చిందన్న రు. ఋత్విగ్వరణం తరువాత అఖండదీపస్థాపన చేయబడింది. అనంతరం వాస్తుపూజ చేయబడింది వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి ప్రత్యేక కలశస్థాపన చేయబడింది. కలశస్థాపన తరువాత కలశార్చన జరిపించబడిందన్నారు. తరువాత పంచావరణార్చనలు నిర్వహించబడ్డాయన్నారు. అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు జరిపించబడ్డాయి.
అంకురార్పణ కార్యక్రమం ప్రత్యేక పూజలు..
ఉగాది ఉత్సవాల మొదటిరోజు సాయంకాలం జరిగే అంకురార్పణకు ఎంతో విశేషముంది. ఈ కార్యక్రమములో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువస్తారు. దీనినే “మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో మూకుళ్ళలో నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని ప్రారంభిస్తారు. ఈ అంకురారోపణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. అలంకారాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు. ఈ ప్రారంభ పూజా కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి అర్చకస్వాములు, వేదపండితులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
