ఉగాది ఆధ్యాత్మిక వైభవం..

ఉగాది ఆధ్యాత్మిక వైభవం..

108 దేవతామూర్తులకు నూతన వస్త్రాల సమర్పణ

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సనాతన ధర్మం, తెలుగు సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచే విశిష్ట కార్యక్రమం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవతామూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

తెలుగు సంవత్సరాది అయిన ఉగాది సందర్భంగా ఆలయ సంస్కృతిని పునరుజ్జీవింపజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాలక్రమేణా పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తూ జీవదుర్దశలో ఉన్న దేవాలయాలకు పునర్జీవం కల్పించాలని భావించి, మచిలీపట్నం పరిధిలోని 108 దేవాలయాల దేవతామూర్తులకు నూతన వస్త్రాలను దంపతులచే సమర్పించే పుణ్యకార్యాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని పేర్కొన్నారు. ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాల నిలయాలుగా నిలుస్తాయని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా యువతలో ధార్మిక చైతన్యాన్ని కూడా పెంచుతాయని అన్నారు.

రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ దేవాలయాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించి, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భక్తులు, దంపతులు, హిందూ ఐక్యవేదిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి భావంతో పాల్గొన్నారు

Leave a Reply