గుంటూరు జీజీహెచ్ కి కేంద్ర బృందం..

గుంటూరు జీజీహెచ్ కి కేంద్ర బృందం..
సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అవార్డ్ ఎంపిక కోసం కసరత్తు
వాట్సాప్ గవర్నెన్స్ విధానం అమలు తీరు పరిశీలన
పేపర్లెస్ హాస్పిటల్ వ్యవస్థ అమలు పై ప్రత్యేక దృష్టి
గుంటూరు మెడికల్, ఆంధ్రప్రభ: గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో ప్రధానమంత్రి “సెంటర్ ఫర్ ఎక్సలెన్స్” అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా కేంద్ర బృందం శుక్రవారం పర్యటించింది. ఆసుపత్రిలో అమలు చేస్తున్న ఆధునిక వైద్య సేవలు, రోగులకు అందిస్తున్న సదుపాయాలు, పరిపాలనలో తీసుకొచ్చిన కొత్త విధానాలను బృందం విపులంగా పరిశీలించింది. ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్ విధానం, పేపర్లెస్ హాస్పిటల్ వ్యవస్థ అమలు ఎలా జరుగుతుందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. డిజిటల్ విధానాల ద్వారా రోగులకు సేవలు ఎంత సులభంగా అందుతున్నాయి, ఆసుపత్రి నిర్వహణలో పారదర్శకత, వేగం ఎంతవరకు పెరిగిందనే విషయాలను కేంద్ర ప్రతినిధులు అధ్యయనం చేశారు.

ఇక ఆసుపత్రిలో రోగుల నమోదు విధానం, వైద్య సేవల అందుబాటు, వైద్య సిబ్బంది పనితీరు, ఆధునిక పరికరాల వినియోగం, రోగులకు అందుతున్న సేవల నాణ్యత వంటి అంశాలపై కూడా సమగ్రంగా పరిశీలన చేపట్టారు. పత్రాల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ విధానాల ద్వారా చికిత్స ప్రక్రియను సరళీకృతం చేసిన విధానం ఈ అవార్డు ఎంపికలో కీలకంగా ఉండనుందని అధికారులు పేర్కొన్నారు. పర్యటన అనంతరం కేంద్ర బృందం అన్ని అంశాలను సమీక్షించి ప్రధానమంత్రి “సెంటర్ ఫర్ ఎక్సలెన్స్” అవార్డు ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి అధికారులు డిజిటల్ సేవలు, వైద్య సదుపాయాలపై కేంద్ర బృందానికి వివరణ ఇచ్చారు. ఈ అవార్డు లభిస్తే గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు దక్కే అవకాశముందని ఆసుపత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


