రైతులకు సూచనలు..

రైతులకు సూచనలు..
వేరుశెనగ కాయలు నిలువ చేయుటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : వేరుశెనగ పంట కోత సమయంలో, వేరుశనగ కాయలు నిలువ చేయుటలో సరైన యాజమాన్య పద్ధతుల ను పాటించాలని ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ సూచించారు. మండలంలోని చిన్నముష్టూర్ గ్రామంలో శుక్రవారం గొల్ల నాగభూషణం అనే రైతు సర్వే నంబర్ 827 పొలంలో వేరుశనగ పంట కోత యాజమాన్యాన్ని ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉరవకొండ సబ్ డివిజన్ లో ఈ రబీ సీజన్. లో 2025-26 వేరుశెనగ పంట సాధారణ విస్తీర్ణం 1, 915 హెక్టార్లకు గాను 1, 382 హెక్టర్లు ( 72 శాతం ) పంట సాగులో ఉందన్నారు. కొన్ని గ్రామాల్లో రైతులు వేరుశనగ పంట కోతలు ప్రారంభించారని, పంట కోత సమయంలో మరియు వేరుశెనగ కాయలు నిలువ చేయుటలో సరియైన యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణం గా మారి, కాయ డొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు పంటను కోయాలన్నారు. ప్రతి మొక్కలో 80 శాతం ముదిరి ఉండాలి, కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలన్నారు. భూమి నుండి మొక్కలను తీయటానికి ట్రాక్టర్ తో నడిచే బ్లేడు, గుంటక లేక వేరుశనగ డిగ్గర్ వాడుకోవాలి. చెట్ల నుండి కాయలను వేరు చేయటానికి పచ్చి లేక ఎండు కాయలను వేరు చేయు యంత్రాలు ఉపయోగించాలన్నారు.
రబీలో ఉత్పత్తి అయిన విత్తన కాయలను వితనం కొరకు నేరుగా ఎండలో ఎండబెట్టకుండా నీడలో ఆరబెట్టాలన్నారు. కాయల్లో తేమ శాతం 9 కి లోపల ఉండేటట్లు ఆరబెట్టి పాలిథిన్ లైనింగ్ ఉన్న గోనె సంచుల్లో నిలువ చేయాలని తెలిపారు. వేరుశనగ కాయల నిలువలో కాయ తొలుచు పురుగు మరియు ఇతర కీటకాల నుండి రక్షణకు 2-3 వారాలకు ఒకసారి మలాథియాన్ ద్రావణాన్ని150 మిల్లీ లీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా డెల్టా మెత్రిన్ 0.5 మి లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ రాజ్ పాల్గొన్నారు.
