పకడ్బందీగా జనగణన…

పకడ్బందీగా జనగణన…

శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

నరసరావుపేట, ఆంధ్రప్రభ : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపునిచ్చారు. నరసరావుపేట లోని MAM ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మొదటి దశ ‘గృహాల జాబితా, గృహ వసతుల గణన’ శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి, శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. శుక్రవారం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్,ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి కృతిక శుక్లా మాట్లాడుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మార్చి 6 నుండి 8 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో జనగణన డేటా సేకరణపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. “మన గణన – మన భవిష్యత్తు” అనే నినాదంతో జరుగుతున్న ఈ మహా యజ్ఞం దేశ ప్రగతికి దిక్సూచి వంటిదని, సేకరించే ప్రతి అంకె అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది అని స్పష్టం చేశారు. ​గృహ నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, ఇంటర్నెట్ వంటి 33 కీలక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందని, సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చట్టరీత్యా బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణ ప్రియా ,జిల్లా ఇన్ చార్జీ రెవెన్యూ అధికారి నారదముని ,ఆర్దీవో మురళి కృష్ణ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply