చర్మకారులకు విశ్వకర్మ శిక్షణ…

చర్మకారులకు విశ్వకర్మ శిక్షణ…

రుణాలు మంజూరు చేయాలి….
ఏపీ సీవీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా.

కర్నూలు, ఆంధ్రప్రభ : చెప్పులు కుట్టే, చర్మ ఆధారిత వృత్తులు నిర్వహించే చర్మకారులకు విశ్వకర్మ యోజన కింద సమగ్ర శిక్షణ అందించి, ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న వారికి తక్షణమే రుణాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘం (ఏపీ సీవీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఏపీ సీవీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రామకోటి హనుమంతు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.డి. ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి సుమాల ఆంథోని, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. భాస్కర్, ఉపాధ్యక్షురాలు డి. విజయమ్మ తదితరులు మాట్లాడారు. వక్తలు మాట్లాడుతూ సమాజ ఆవిర్భావం నుంచి చర్మకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. చనిపోయిన పశువుల చర్మాన్ని వినియోగించి మనిషికి అవసరమైన అనేక వస్తువులను సృష్టించిన ప్రధమ శాస్త్రవేత్తలు చర్మకారులేనన్నారు.

చెప్పులతో పాటు బెల్టులు, బ్యాగులు, పశువుల మెడగంటలు, చర్నాకోలాలు వంటి అనేక ఉత్పత్తులు చర్మ ఆధారంగానే తయారవుతున్నాయని తెలిపారు. ఆధునిక యుగంలోనూ పాత తరం నుంచి కొనసాగుతున్న ఈ వృత్తిని దళితులు ఇప్పటికీ చెట్టు నీడలో, గోడచాటు, చినిగిన బ్యానర్లు, చిల్లులు పడిన గొడుగుల కింద కొనసాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము, దూలి, ఎండ, వానల మధ్య పని చేస్తూ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినా, అతి కొద్ది మంది చర్మకారులకు మాత్రమే శిక్షణ అందిందని ఆరోపించారు. 2023లో శిక్షణ పొందిన అనేక మందికి ఇప్పటికీ రుణాలు మంజూరు కాలేదని విమర్శించారు. మెజారిటీ వృత్తిదారులకు శిక్షణ ఇచ్చి, రూ.50 వేల విలువైన టూల్‌కిట్లు మంజూరు చేసి, వృత్తి కేంద్రాలను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రుణసహాయం అందించి చర్మకారులు ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే మరింత పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుమాల రాజు, రౌడూరు లింగన్న, జుమాలదిన్నె పౌవలయ్య, చింతకుంట ఈరన్న, సాతనూరు జోజప్ప, తుమ్మలూరు స్వామిదాసు, కందుకూరు శంకరప్ప, కెవిపిఎస్ నాయకులు సురేష్, నగర నాయకులు రోసి, చిన్న ఆనంద్, మద్దిలేటి, రవి, రోజా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply