ఉచిత ఆన్‌లైన్ ఆంగ్ల శిక్షణ..

ఉచిత ఆన్‌లైన్ ఆంగ్ల శిక్షణ..
40 రోజుల ప్రత్యేక తరగతులు
250 మంది ఉపాధ్యాయులతో ఓరియెంటేషన్ కార్యక్రమం..
విద్యార్థుల్లో ఆంగ్ల సంభాషణ నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం
ఆంధ్రప్రభ విజయవాడ : ఎన్‌టీఆర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి దిశగా 40 రోజుల ఉచిత ఆన్‌లైన్ ఆంగ్ల భాష బోధన తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ సహకారంతో, విల్ టు కెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓరియెంటేషన్ సమావేశం స్థానిక బిషప్ హాజరయ్య స్కూల్ లో నిర్వహించగా, సుమారు 250 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ట్రైనర్ రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి తెలుగు మాట్లాడినంత సులభంగా ఆంగ్లంలో మాట్లాడే స్థాయికి చేరుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఉపాధ్యాయులు తరగతుల పట్ల చూపుతున్న ఆసక్తి పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సుమారు 53 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా విశాఖపట్నం, అన్నమయ్య జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
