AP | ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం….

AP | ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం….
– అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
AP | నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుతో విన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, భూ సంబంధిత, పింఛన్లు, రేషన్, రహదారులు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు వంటి పలు అంశాలపై అర్జీలు సమర్పించారు. అందిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలిస్తూ సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు.
వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి సమస్యను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతాయని, ప్రజా పాలన మరింత పారదర్శకంగా మారేందుకు దోహదపడతాయని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు.
