AP | చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై పోలీసులకు ఫిర్యాదు

AP | చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై పోలీసులకు ఫిర్యాదు

  • టీటీడీ లడ్డు విషయంలో దేవదేవుడిని అవమానించారు..
  • క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
  • మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

AP | భవానిపురం, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి దేవదేవుడిని అవమానించారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ దేవాదాయ శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఈ రోజు విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది సెప్టెంబర్ 18 నుంచి ఇప్పటి వరకు లడ్డు ప్రసాదంలో పందికొవ్వు, జంతు కొవ్వు, చేప నూనె కలిసిందంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ పదే పదే మాట్లాడటం ద్వారా కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. అయితే రెండు జాతీయ ప్రయోగశాలల నివేదికల్లో ఎక్కడా కూడా జంతు కొవ్వు లేదని స్పష్టంగా తేలిందన్నారు.

AP

ప్రభుత్వం మారిన తరువాతే నెయ్యి నమూనాలు తీసుకోవడం, ట్యాంకర్లు రావడం, వాటిని వినియోగించడం జరిగిందని నివేదికలో ఉందని పేర్కొంటూ, ఏదైనా తప్పు జరిగి ఉంటే అది పూర్తిగా కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అయినా దేవుడిపై అపవాదు మోపుతూ ప్రజలను తప్పుదారి పట్టించడం దుర్మార్గమన్నారు. లడ్డు అంశంపై రోడ్లపై ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారని, ఇది చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద అపచారమని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిని అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పై కూడా వెలంపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇసుక, రేషన్, మద్యం, మట్టి దోపిడీల్లో ప్రధాన పాత్ర కేశినేని చిన్ని దేనని ఆరోపించారు.

ఎన్టీఆర్ జిల్లాలోని వనరులన్నింటినీ దోచుకుంటున్న వ్యక్తి ఆయనేనని అన్నారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరగడం హత్యాయత్నమేనని, అలాంటి ఘటనలపై చిన్న కేసులతో సరిపెట్టడం అన్యాయమన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై జరుగుతున్న హింసను ఉదాహరణగా చూపుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. కూటమి ప్రభుత్వానికి పాలించే నైతిక అర్హత లేదని, రాష్ట్రంలో చట్టసువ్యవస్థ పూర్తిగా విఫలమైందని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెలంపల్లి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్, కార్పొరేటర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply