అమరావతి : సుమారు రూ.లక్ష కోట్ల అమరావతి పనులకు శంఖుస్థాపనకు మే రెండో తేదీన వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలకాలని ముందు నిర్ణయించగా.. తీవ్రవాదులు పర్యాటకులను చంపిన నేపథ్యంలో రోడ్ షోలను రద్దు చేశారు.తొలుత మోదీ హెలిప్యాడ్‌ను ఏపీ సచివాలయం వద్ద ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సుమారు కిలోమీటర్ మేర సభ వరకు ప్రధాని మోదీ రోడ్ షో చేసేలా అధికారులు ప్లాన్ చేశారు.
ముప్పైవేల మంది రాజధాని మహిళా రైతులు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ప్రధానిని పూలతో ఆహ్వానించేలా రూట్ మ్యాప్ రూపొందించారు. ఇప్పటికే ఆ మార్గంలో బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే రీసెంట్‌గా జమ్ము,కాశ్మీర్‌లోని వహల్‌గావ్‌లో తీవ్రవాదులు పర్యాటకులపై దాడులు చేసిన నేపథ్యంలో పీఎం భద్రత రీత్యా.. అమరావతిలో ఆయన పర్యటనపై పలు ఆంక్షలను ఇంటెలిజెన్స్ విధించింది.వేలాది మంది మధ్య ఓపెన్ టాప్ జీప్‌లో ప్రధానమంత్రిని వేదిక వద్దకు తీసుకురావడం భద్రతా పరంగా అంత మంచిది కాదని తేల్చిచెప్పింది.
రోడ్ షోను రద్దు చేయాలని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఇప్పటికే తేల్చిచెప్పింది. దానిని ప్రధానమంత్రి పర్యటనకు స్టేట్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న వీరపాండ్యన్ శనివారం ప్రకటించారు. వేదిక వద్ద శనివారం మధ్యాహ్నం నిర్వహించిన పోలీస్, రెవెన్యూ, వివిధ విభాగాల అధికారుల సమీక్షా సమావేశంలో ప్రధానమంత్రి పర్యటనలో చోటు చేసుకున్న మార్పులను వివరించారు.
ఓపెన్ టాప్‌లో రోడ్ షో ఉండదన్నారు. ఆ మేరకు ఏర్పాట్లలో మార్పులు చేయాలన్నారు. ఓపెన్ టాప్ రోడ్ షో రద్దు అయినా హెలీప్యాడ్ నుంచి కారులో ప్రధానమంత్రిని వేదిక వద్దకు తీసుకువస్తున్న మార్గంలో ఇరువైపులా 15 వేల మందితో స్వాగతం పలికేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వాటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.
యథావిధిగా సభ..ప్రధాని రోడ్డు షో మాత్రమే రద్దు చేయగా.. యథావిధిగా సభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు అయిదు లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మోదీ పర్యటనకు ఈసారి భద్రత కట్టుదిట్టం చేశారు.