ఇక ఏఎన్‌పీఆర్ కెమెరాలు..
- ఏసీబీ దెబ్బతో రాష్ట్రంలో మూతపడ్డ చెక్ పోస్టులు
- తగ్గనున్న ట్రాఫిక్ సమస్య
- ఇక వాహనాల రాకపోకలు సులభతరం
- సరుకు రవాణా, వాణిజ్య కార్యకలాపాల వేగవంతం
- భవిష్యత్ లో ఈ టెక్నాలజీ
- సీసీటీవీ పర్యవేక్షణ ద్వారా వాహనాల తనిఖీలు
ఉమ్మడి మెదక్, ఆంధ్ర ప్రభ బ్యూరో : దశాబ్దాల చరిత్ర కలిగిన అంతరాష్ట్ర చెక్ పోస్టులకు ఎట్టకేలకు చెక్ పడింది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ(GST) అమలు నేపథ్యంలో చెక్ పోస్టుల అమలు అవసరం లేదని గతంలోనే కేంద్రం తేల్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఆయా రాష్ట్రాలు ఎత్తివేశాయి. ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో చెక్ పోస్టులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయా శాఖల్లో నెలకొన్న అవినీతి పై నజర్ పెట్టారు. ఇందులో భాగంగా ఏసీబీ పలు శాఖలపై నజర్ పెట్టి దాడులు చేస్తుంది. ఇటీవలే చెక్ పోస్టులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే దీనికంటే ముందు రాష్ట్రంలోని 15 అంతరాష్ట్ర చెక్‌పోస్టుల్లో శనివారం నుండి ఆదివారం వరకు ఏసీబీ దాడులు నిర్వహించి డబ్బు పట్టుకుంది. ఇదిలా ఉండగానే శరవేగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అంతరాష్ట్ర చెక్ పోస్టుల(check posts)ను ఎత్తివేయాలని రవాణా కమిషనర్‌కు ఆదేశాలు చేయగా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు మూసివేయాలని జిల్లా డీటీలకు ఆదేశాలు వెళ్ళాయి. ఈ నేపధ్యంలో దశాబ్దాల చరిత్ర కలిగిన చెక్ పోస్టులకు చెక్ పెట్టినట్లయింది.
తెలంగాణ రాష్ట్రంలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల తొలగింపు, వాటి స్థానంలో సాంకేతిక పర్యవేక్షణతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 అంతరాష్ట్ర చెక్ పోస్టులను తొలగించివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా కమిషనర్(State Transport Commissioner) జిల్లా డీటీఓలకు తక్షణమే చెక్ పోస్టులను మూసివేయాలని, ప్రస్తుతం ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించి వాటిని పర్యవేక్షించాలని డీటీఓలకు ఆదేశాలిచ్చారు.
చెక్ పోస్టుల వద్ద విధుల్లో సిబ్బంది ఎవరూ ఉండకూడదని, చెక్ పోస్టుల్లో ఉన్న బోర్డులు, బారికేడ్లను తొలగించే ప్రక్రియను మొత్తం వీడియో భద్రపరచాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తక్షణం డీటీఓ( DTO) కార్యాలయాలకు తరలించాలని, అలాగే పరిపాలన రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చాలాన్లను అన్నింటినీ డీటీవో కార్యాలయనికి తరలించి భద్రపరచాలని ఆదేశించారు.
ఇంతకాలం చెక్ పోస్టులు నిర్వహించిన స్థలాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెక్ పోస్టులను మూసివేసినట్టుగా, సిబ్బందిని రీడిప్లాయ్ చేసినట్టు, రికార్డులను భద్రపరిచిన విషయాలన్నింటిపైనా నివేదిక అందించాలని డీటీఓలను ఆదేశిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏసీబీ దెబ్బతో మూతపడ్డ చెక్ పోస్టులు..
అంతరాష్ట్ర వాణా శాఖ చెక్‌పోస్టులపై ఇటీవల కాలంగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. వాహనాల డ్రైవర్ల నుండి అక్రమంగా చెక్ పోస్టుల వద్ద డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే విషయమై శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు 12 అంతరాష్ట్ర చెక్ పోస్టుల(Interstate check posts) పై ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించి 4.18 లక్షల నగదును పట్టుకుంది.
అంతరాష్ట్ర చెక్ పోస్టుల్లో అధికారులు, సిబ్బంది ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని గుర్తించిన అధికారులు, సిబ్బంది లిస్టును ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. అదేవిధంగా సదరు అధికారులు, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఏసీబీ సిఫార్స్ చేసింది. ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం(State Government) వెంటనే అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తివేస్తున్నట్లు ఈ రోజు నిర్ణయం తీసుకుంది.
తగ్గనున్న ట్రాఫిక్ సమస్య – సరుకు రవాణా, వాణిజ్య కార్యకలాపాల వేగవంతం..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 15 సరిహద్దు చెక్‌పోస్టులను తొలగించింది. చెక్ పోస్టుల తొలగింపుతో రాష్ట్ర సరిహద్దుల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయి. సరకు రవాణా, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం కానున్నట్లు ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ఇప్పటికే కామారెడ్డి(Kamareddy) చెక్‌పోస్టు వద్ద ప్రయోగాత్మకంగా ఈ- కెమెరాలను అమర్చారు.
వాటి సహాయంతో ఉల్లంఘనలు జరిపిన వాహనాలను ట్రాక్ చేసి చర్యలు తీసుకునేందుకు హ్యాండ్‌హెల్డ్ పరికరాలు అధికారులకు ఇవ్వనున్నారు. అయితే వీటిని తనిఖీ చేసే పనికి ప్రభుత్వం ఆరు నెలలపాటు ప్రత్యేక మొబైల్ స్క్వాడ్లను నియమించాలని రవాణాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొబైల్ స్క్వాడ్(Mobile Squad)లు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతితో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి తనిఖీ చేస్తాయి.
ఈ నిర్ణయం కారణంగా చెక్ పోస్టుల వద్ద అవినీతికి చెక్ పెట్టినట్లైంది. ఈ రంగంలో పారదర్శకతను పెంచడం.. వాహనదారులకు త్వరగా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. అదనంగా.. నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించేందుకు ఏఎన్‌పీఆర్(ANPR) (ఆటో నంబర్ ప్లేట్ రీడర్) కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.