(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : పేదలకు కడుపు నిండా భోజనం పెడుతూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లలో నిర్వహణ పరంగా లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని సింగ్‌నగర్ అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు చేసిన ఏర్పాట్లు, మరుగుదొడ్లు తదితరాలను కూడా పరిశీలించారు.
క్యూలైన్ లో నిల్చొని స్వయంగా రూ.5 టోకెన్‌ను కొనుగోలు చేసి అల్పాహారాన్ని రుచి చూశారు. అల్పాహార నాణ్యత ఎలా ఉందో అక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ఆహారం తిన్నాక క్యాంటీన్‌లో కల్పించిన సౌకర్యాలు, ఆహార శుచి, రుచి ఎలా ఉందో లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను తీసుకునే ప్రక్రియను పరిశీలించడంతో పాటు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి స్వయంగా అభిప్రాయం తెలియజేశారు. క్యాంటీన్‌లో ప్రతిరోజూ పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఎలా ఉంది? అహారం నాణ్యత ఎలా ఉంది? సరైన సమయానికే క్యాంటీన్ తెరుస్తున్నారా? వంటి వివరాలు పొందుపరచాలని, దీనివల్ల మరింత మెరుగ్గా సేవలందించేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు సూచించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో ఆహ్లాదకర, పరిశుభ్రమైన వాతావరణంలో పేదలు భోజనం చేసేందుకు ప్రభుత్వం ఆవకాశం కల్పించిందన్నారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడం ద్వారా ఎంతో సంతృప్తి సొంతమవుతుందని.. ప్రభుత్వ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో సేవలందించాలని సూచించారు. పటిష్ట పర్యవేక్షణతో అన్నా క్యాంటీన్ల ద్వారా పూర్తిస్థాయిలో సంతృప్తికరమైన సేవలు అందించేలా చూస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, తదితరులు పాల్గొన్నారు.