Andhra Pradesh | ఎమ్మెల్సీ ఎన్నికల ప్ర‌చారానికి తెర‌…..

మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు
రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ స్థానంలో పోరు
రెండు చోట్ల బ‌రిలో కూట‌మి అభ్య‌ర్ధులు
ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్‌కు మ‌ద్ద‌తు
ఈ నెల 27న పోలింగ్

వెల‌గ‌పూడి, ఆంధ్ర‌ప్ర‌భ : ఏపీ శాసనమండలిలో ప్రస్తుతం వైసీపీకి బలం ఉంది. అయితే అధికారం మారిన తర్వాత.. ఆ బలం కూడా మారుతూ వస్తోంది. ఖాళీ అయిన ప్రతీ ఎమ్మెల్సీ స్థానం అధికార పార్టీ వశం అవుతోంది. ఇప్పుడు మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. వైసీపీ పోటీకి దూరంగా ఉంది. సీపీఐ కూడా తమ అభ్యర్థులను పోటీ చేయించడం లేదు. సీపీఎం మాత్రం రంగంలోకి దిగింది. ఇక మంగ‌ళ‌వారం సాయంత్రం నాలుగు గంట‌లకు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌ప‌డింది. ఏపీలో ప్రస్తుతం రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

పోటాపోటీగా ప్ర‌చారం..

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారం దాదాపు పూర్తయింది. నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడంలో ముందున్నారు. కీలక నేతలు, సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. నియోజకవర్గాల్లో ఓటర్లను కలిసి స్థానిక ఎమ్మెల్యేలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయ‌న కూట‌మి అభ్య‌ర్ధికి బ‌ల‌మైన పోటీ ఇస్తున్నారు.. గత ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగిన పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం ఇప్పటికే అన్ని వర్గాల వారిని కలిసి ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను చుట్టేస్తూ.. గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి రాజశేఖర్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇక‌ ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి రాఘవులు కూటమి అభ్యర్థికి పోటీ ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఏపీటీఎఫ్ నాయకుడు పాకలపాటి రఘువర్మ పోటీలో ఉన్నారు. పీఆర్టీయూ తరపున మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది.. ఉపాధ్యాయ వర్గం నుంచి ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదని.. దీంతో వర్మ గెలుపును ఆపలేరని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉ సీపీఎం అభ్యర్థిగా విజయగౌరిని రంగంలోకి దించారు. ఆమె యూటిఎఫ్ నాయకురాలు. పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు.

కూటమికే సీపీఐ మ‌ద్ద‌తు..

ఈ ఎన్నిక‌ల‌లో కలిసి పోటీ చేయాలన్న సీపీఐ ప్రతిపాదనను సీపీఎం రిజెక్ట్ చేసింది. దీంతో అనధికారికంగా కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సీపీఐ నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదు. కారణాలు ఎలా ఉన్నా.. ఫ్యాన్ పార్టీ తప్పుకోవడంతో.. కూటమి అభ్యర్థులకు అవకాశాలు కలిసొచ్చాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా.. రాజేంద్రప్రసాద్, లక్ష్మణరావు మధ్యనే పోటీ ఉండడం ఖాయం. ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో 35మంది బరిలో ఉన్నారు. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మొత్తం 10 మంది పోటీ చేస్తున్నారు. పోటీ మాత్రం రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు మధ్యే పోరు అని విశ్లేష‌కులు చెబుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *