గర్భిణీ, బాలింతలకు వరంగా అమ్మ ఒడి..

కాజీపేట, ఆంధ్రప్రభ ; రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న అమ్మఒడి పథకం గర్భిణీ, బాలింతలకు వరంగా మారింది. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందిస్తున్న ప్రభుత్వ అమ్మ ఒడి (102) వాహన సేవలు రోజురోజుకు జిల్లాలో విస్తరిస్తూ వేలాది మందికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వైద్య సేవలకు సులభంగా చేరుకునే అవకాశాలు లేకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడంలో ఈ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ప్రస్తుతం జిల్లాలో ఏడూ 102 వాహనాలు అందుబాటులో ఉండగా, అవి అన్ని మండలాల్లో నిరంతరం సేవలందిస్తూ గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అవసరమైన సమయంలో ఆసుపత్రులకు సురక్షితంగా తరలిస్తున్నాయి. 2025 మార్చి నుండి 2026 ఫిబ్రవరి వరకు మొత్తం 26,754 మంది లబ్ధిదారులు ఈ సేవలను వినియోగించుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు, టీకాలు, వైద్య పర్యవేక్షణ అందుబాటులోకి రావడమే కాకుండా, ప్రసవ సమయంలో అత్యవసర రవాణా సౌకర్యం కూడా సమయానికి లభిస్తోంది.
ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ సేవలు ఎంతో మేలు చేస్తున్నాయని ప్రోగ్రాం మేనేజర్ పాటి శివ కుమార్, జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అమ్మ ఒడి (102) సేవలు గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణలో కీలక భాగంగా మారాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వెంటనే స్పందించి, తల్లి మరియు శిశువు ప్రాణాలను కాపాడడంలో ఈ వాహనాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు ఈ సేవలను మరింతగా వినియోగించుకోవాలి” అని సూచించారు. అదేవిధంగా.. ఈ వాహనాలు కేవలం ప్రసవ సమయానికే కాకుండా, గర్భిణీ స్త్రీల నెలవారీ తనిఖీలు, అవసరమైన వైద్య పరీక్షల కోసం కూడా ఉపయోగపడుతున్నాయి. సమయపాలనతో పాటు శిక్షణ పొందిన సిబ్బంది సేవల వల్ల రోగులకు భద్రత, నమ్మకం పెరిగిందని తెలిపారు.
