America | అయిదు ల‌క్ష‌ల వ‌ల‌స‌దారుల‌పై ట్రంప్ వేటు ..

వాషింగ్ట‌న్ డిసి – అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే భారత్‌ సహా ఆయా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారుల్ని పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక నివాస హోదాను అమెరికా రద్దు చేసింది. త్వరలో వారంతా బహిష్కరణకు గురికానున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు అక్రమ వలసదారులపై ట్రంప్ వేటు వేస్తున్నారు.

తాజాగా క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులాకు సంబంధించిన 5లక్షల మందికి పైగా వలసదారులకు పెరోల్ కార్యక్రమాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఒక నెలలో వారిని బహిష్కరించే అవకాశం ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం శుక్రవారం తెలిపింది. ఈ ఆర్డర్ అక్టోబర్ 2022 నుంచి అమలవుతుందని తెలిపింది. ఈ నాలుగు దేశాల నుంచి దాదాపు 5,32,000 మంది వచ్చినట్లుగా గుర్తించింది. వీళ్లంతా అమెరికా నుంచి బహిష్కరణకు గురికానున్నారు. వీళ్లంతా తొలుత ఆర్థిక స్పాన్సర్లతో పాటు రెండేళ్లు నివాసించడానికి.. పని చేయడానికి అనుమతి పొందారని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ పేర్కొన్నారు. వీళ్లంతా దాదాపు 30 రోజుల్లో చట్టపరమైన హోదా కోల్పోతారని తెలిపింది.

మానవతా పెరోల్‌ కింద అమెరికాకు వచ్చే వారు రెండేళ్ల పాటు చట్టబద్ధంగా దేశంలో ఉపాధి పొందొచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత మరింత ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా శరణార్థిగా లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నాలుగు దేశాలకు సంబంధించిన 5 లక్షల నివాసాలను అమెరికా రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *