Amaravati | సీఆర్డీఏ సమావేశంలో సీఎం కీల‌క‌ నిర్ణయం..

  • మౌలిక సదుపాయాలకు రూ.904 కోట్లు
  • మంగళగిరిలో జెమ్స్ & జ్యూయలరీ పార్క్
  • నీటి & సివరేజ్ ప్రాజెక్టులు
  • విద్య & వైద్య రంగాలకు ప్రోత్సాహం
  • ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఎస్పీవీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ సీఆర్డీఏ సమావేశంలో పలు ముఖ్య ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు, ప్రత్యేక వాహక సంస్థ (SPV) స్థాపన ప్రధాన అంశాలుగా నిలిచాయి.

మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్

మంగళగిరి ఆత్మకూరు వద్ద 78 ఎకరాల్లో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. భూసేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఈ క్లస్టర్ ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రాజెక్టు ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

రాజధానికి స్పెషల్ పర్పస్ వెహికల్

రాజధానిలో చేపట్టే ప్రధాన నిర్మాణాలు వేగవంతం చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటుకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు అమలు కానున్నాయి. అంతేకాదు, కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ వంతెన డిజైన్‌ను కూచిపూడి నృత్య భంగిమలు సహా ఆధునిక కాన్సెప్ట్‌లతో ఎంపిక చేయాలని సీఎం సూచించారు.

మౌలిక వసతుల ఆమోదం

రాజధాని నిర్మాణ పనులకు కొత్త ఊపునిచ్చేలా సీఆర్డీఏ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల కోసం రూ.904 కోట్ల రూపాయల నిధులు ఆమోదం పొందాయి. ఇందులో డ్రెయిన్లు, నీటి సరఫరా వంటి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి రూ.411 కోట్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కోసం రూ.376.60 కోట్లు కేటాయించారు. అదే విధంగా విద్యా రంగ అభివృద్ధి కోసం విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెరో 100 ఎకరాల అదనపు భూకేటాయింపు చేయాలని నిర్ణయించారు. భూసేకరణ పథకం కింద జారీ చేసే యాజమాన్య ధృవపత్రాలలో ఉన్న “అసైన్డ్” పదాన్ని తొలగించేందుకు కూడా అథారిటీ ఆమోదం తెలిపింది.

సీఎం దిశానిర్దేశం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. అమరావతి నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన సాగాలని, ప్రతి ప్రాజెక్టు పనిని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. అన్ని ప్రాజెక్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు ఐకానిక్‌గా నిలవాలని ఆయన పునరుద్ఘాటించారు.

అంతేకాకుండా, త్వరలోనే అమరావతిలో బయో ఇంజినీరింగ్ యూనివర్సిటీ ఏర్పాటు కానుందని సీఎం ప్రకటించారు. “అమరావతికి ఉన్న ప్రత్యేక భౌగోళిక స్థానం దేశంలో ఎక్కడా లేనిది. ఇక్కడ చేపట్టే ప్రతి ప్రాజెక్టు ఆర్థిక ప్రగతికి దోహదం చేయాలి” అని ఆయన అన్నారు.

Leave a Reply