Amaravathi RRR   అవుట‌ర్‌…టెర్రర్‌  AndhraPrabha SPL  Story

Amaravathi RRR   అవుట‌ర్‌…టెర్రర్‌  AndhraPrabha SPL  Story

ఓఆర్ఆర్ భూ పేచీ

250 మీట‌ర్ల  గెజిట్‌పై గ‌రం..గ‌రం..

ప‌రిహారంపై అస్పష్టత

బ‌ల‌వంతం  సహించం

 ఆందోళనకు రైతన్న సిద్ధం

 కంగారుపడొద్దు 

న్యాయం జరుగుతోంది..

 ఎంపీ కేసినేని శివనాథ్

 (ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌)

అమ‌రావ‌తి ఔట‌ర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియ‌కు ఆదిలోనే బ్రేక్ పడేలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అయితే గ‌తంలో ప్రభుత్వం పేర్కొన్నట్లు 140 మీట‌ర్లు కాకుండా అందులో 250 మీట‌ర్లని పేర్కొన‌డం వివాదానికి దారితీసింది. అయితే ఉన్నతాధికారులు మాత్రం కేవ‌లం 140 మీట‌ర్ల మేర‌కే భూములు, పొలాలు స్వాధీనం చేసుకుంటామ‌ని చెబుతున్నా వారి మాట‌ల‌ను అన్నదాత‌లు విశ్వసించ‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు ఆరు అడుగులు వెన‌క్కు అన్న చందంగా మారింది. 

ఓఆర్‌ఆర్ పేరుతో అమరావతి చుట్టూ భారీ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం మండలాల్లోని 18 గ్రామాల్లో 1,798 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 1,416.31 హెక్టార్ల భూమి సేకరించనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే తొలుత అధికారులు ర‌హ‌దారి వెడ‌ల్పు కేవ‌లం 140 మీట‌ర్లు మాత్రమే ఉంటుంద‌ని పేర్కొన్నారు. కానీ గెజిట్‌లో 250 మీట‌ర్లుగా ఉండ‌డంతో అన్నదాత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస‌లు త‌మ‌ను సంప్రదించ‌కుండా, గ్రామ స‌భ‌లు నిర్వహించ‌కుండా భూ సేక‌ర‌ణ‌కు నోటిఫికేష‌న్ జారీ చేయ‌డాన్ని ప‌లువురు ప్రశ్నిస్తున్నారు.

..సార‌వంత‌మైన భూముల‌ను వ‌దులుకోం..

ప‌రిహారం, ప్రత్యామ్నాయ స్థలాల అంశంపై ఎటువంటి స్పష్టత ఇవ్వక‌పోతే భూములు ఇచ్చే ప్రస‌క్తే లేద‌ని రైతులు తెగేసి చెబుతున్నారు. ఎంతో సార‌వంత‌మైన భూముల‌ను తాత‌ల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామ‌ని అటువంటి భూముల‌ను ఎటువంటి నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకోవాల‌ని చూస్తే ఊరుకోమ‌ని హెచ్చరిస్తున్నారు.   తరతరాలుగా సాగుచేస్తున్న మూడు పంటలకు అనుకూలమైన సారవంతమైన భూములు, వాణిజ్య పంటల తోటలను కోల్పోతే తమ జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులతో పాటు, అనుబంధ రంగాల్లో పనిచేసే అనేక కుటుంబాలు కూడా ఉపాధి కోల్పోయి కూలీలుగా మారాల్సి వ‌స్తోంద‌ని మండిప‌డుతున్నారు. రాజ‌ధాని ప్రాంతం వేగంగా విస్త‌రిస్తుండ‌డంతో భూముల ధ‌ర‌లు నింగినంటుతున్నాయి. ఓఆర్ ఆర్ కోసం భూములు కోల్పోతే మ‌ళ్లీ అమ‌రావ‌తి ప్రాంతంలో భూములు కొనుగోలు చేయ‌లేని ప‌రిస్థితి ఉంది. క‌నీసం ప్రత్యామ్నాయ ఉపాధి ఏమిట‌న్న ప్రశ్న ఈ ప్రాంత రైతుల‌ను వెంటాడుతోంది.

భూముల విలువ పెంపు వ‌ర్తించ‌దా?..

కూట‌మి ప్రభుత్వం ఇటీవ‌ల రిజిస్ట్రేష‌న్ విలువ‌ను 20 నుంచి 25 శాతానికి పెంచింది. అయితే ఈ పెంపు నిర్ణయం ఓఆర్ ఆర్‌కు భూములు ఇచ్చే రైతుల‌కు వ‌ర్తించ‌ద‌ని పేర్కొన‌డంతో అవాక్కవుతున్నారు. ఇదెక్కడి చోద్యమ‌ని  ప్రశ్నిస్తున్నారు. త‌క్కువ ప‌రిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగ‌డ వేసింద‌ని రైతు సంఘాల నాయ‌కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎంతో విలువైన భూములను ఒ ఆర్ ఆర్ కోసం వదులుకుంటున్న తమకు సరైన నష్టపరిహారం మార్కెట్ విలువ ఆధారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

..60-70 మీట‌ర్ల‌కు ప‌రిమితం చేయాలి..

అవుట‌ర్ రింగ్ రోడ్డు వెడ‌ల్పును 60 నుంచి -70 మీట‌ర్లకే ప‌రిమితం చేయాల‌ని  కంచికచర్ల, వీరులపాడు మండలాల రైతులు  కోరుతున్నారు.  భూ సేక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన గెజిట్ నోటిఫికేష‌న్ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అభ్యంత‌రాల‌పై కాల వ్య‌వ‌ధి కూడా 60 రోజుల‌కు పెంచాల‌ని రైతులు కోరుతున్నారు. తాజా రిజిస్ట్రేష‌న్ విలువ‌ల‌ను ఓఆర్ ఆర్ భూ సేక‌ర‌ణ గ్రామాల‌కు కూడా వ‌ర్తింప‌జేయాల‌న్నారు. అదేవిధంగా భూముల‌కు మంచి ప‌రిహారంతో పాటు రాజ‌ధాని ప్రాంతంలో నివాస‌, వాణిజ్య ప్లాట్లు కేటాయించాల‌ని కూడా రైతులు కోరుతున్నారు. త‌మ ప్రతిపాద‌న‌ల‌కు ప్రభుత్వం అంగీక‌రిస్తేనే భూములు ఇస్తామ‌ని లేకుండా ఇచ్చే ప్రస‌క్తే లేద‌ని వారు స్పష్టం చేస్తున్నారు.

…. ఆందోళన అవసరంలేదు..

భూ సేక‌ర‌ణ‌పై రైతులు అన‌వ‌స‌ర ఆందోళ‌న‌కు గురికావ‌ద్దని జాతీయ ర‌హ‌దారుల శాఖ అధికారులు అంటున్నారు. ముందు జాగ్రత్త కోసం గెజిట్ నోటిఫికేష‌న్‌లో 250 మీట‌ర్లుగా పొందుప‌రిచామ‌ని కేవ‌లం 140 మీట‌ర్ల వెడ‌ల్పుతోనే రోడ్డు నిర్మాణం జ‌రుగుతుంద‌ని స్పష్టం చేస్తున్నారు.  జీపీఎస్ ఆధారంగా కొలతలు తీసుకుని తుది సరిహద్దులు నిర్ణయిస్తామని, తుది నోటిఫికేషన్‌లో అదే పొందుపరుస్తామని అధికారులు వివరిస్తున్నారు. అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నిర్మిస్తున్న ఓఆర్ఆర్ రహదారికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూములు కోల్పోతున్న రైతులకు తగిన విధంగా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్తున్నారు.

.. రైతుల ఆందోళన ఉధృతం.

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఓఆర్ఆర్ కు సంబంధించి నష్టపోతున్న రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ నోట్ ను  అనుసరించి తాము భూములు ఇచ్చేలేదని చెప్తున్నా రైతులు ఎంతో విలువైన సారవంతమైన భూములు అతి తక్కువ ధరకు ఇవ్వడం తమ వాళ్ళ కాదని తెచ్చి చెప్తున్నారు. మార్కెట్ రేటుగా అనుసరించి భూముల సేకరించాలని విజ్ఞప్తి చేస్తున్న రైతులు ఇప్పటికే ఆందోళన ప్రారంభించి తమ నిరసనను పలు విధాలుగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీర్లపాడు కంచికచర్ల మైలవరం ప్రాంతాలలోని ప్రభావిత రైతులు ఉన్నతాధికారులను ప్రజాప్రతినిధులను కలిసి తమ సమస్యలను వెల్లడించడంతోపాటు డిమాండ్లను సైతం వారు ముందు ఉంచుతున్నారు. పలుగుతాలుగా నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు తగిన విధంగా తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని లేనిపక్షంలో సెంటు భూము కూడా ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్తున్నారు.

త్వరలో ఉన్నత స్థాయి సమావేశం..

 ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా నష్టపోతున్న రైతులు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి త్వరలోనే ఉన్నతిస్తాయి సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా చేస్తాం. అభివృద్ధి జరుగుతున్న తరుణంలో రైతులు కూడా సహకరించాలి.

  • కేశినేని శివనాథ్, విజయవాడ ఎంపీ

Leave a Reply