మంత్రి కొండా సురేఖకు న్యాయస్థానం షాకిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో, నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్, నటి సమంత విడాకుల వివాదం వంటి అంశాలపై కేటీఆర్ పై నిరాధారమైన ఆరోపణలు చేశారని తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని పేర్కొంటూ కేటీఆర్ పరువు నష్టం దావాను దాఖలు చేశారు. అయితే, ఈ కేసు విచారణ సమయంలో కొండా సురేఖ న్యాయవాది పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కోర్టు వాటిని తోసిపుచ్చింది.
కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలతో ఏకీభవించిన కోర్టు, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంటూ, 21వ తేదీలోపు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని తీర్పునిచ్చింది.