Allegations | చేయి త‌డ‌పాల్సిందే..!

Allegations | గుడివాడ, ఆంధ్ర‌ప్ర‌భ‌ : గుడివాడ పురపాలక సంఘంలో పారిశుధ్య‌ కార్మికులకు గత 20 ఏళ్లుగా రావాల్సిన స్పెషల్ ఇంక్రీమెంట్ బిల్లులు చేయడానికి ఓ ఉద్యోగి చేతివాటం చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో 87 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రతీ ఒక్కరికి 12, 18 ఏళ్ల స్పెషల్ గ్రేడ్‌ ఇంక్రిమెంటు వస్తుంది. వీరికి పదోన్నతులు ఉండవు కాబట్టి ప్రభుత్వం ఇంక్రిమెంటు ఇస్తుంది.

కార్మికులు మధ్యలో గైర్హాజరవుతుండడం లాంటివి నిత్యం జరుగుతుంటాయి. వీటిని అదునుగా తీసుకుని బిల్లులు చేయడానికి కార్మికుల నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంక్రిమెంటు ద్వారా కార్మికులకు రావాల్సిన బకాయిల బిల్లులు చేయడానికి పురపాలక కార్యాలయంలోని ఓ గుమస్తా సొమ్ములు వసూలు చేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఒక్కో కార్మికునికి వచ్చే బకాయిల మొత్తం రూ. లక్షల్లో ఉంటే వారి నుంచి రూ.40 వేల‌ నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కలెక్టర్‌కు, పురపాలక కమిషనర్‌కు అనేక మార్లు ఫిర్యాదులు చేసిన‌ట్లు చెబుతున్నారు. 18 మంది కార్మికులు ఇప్పటికే తమ బిల్లుల కోసం వడ్డీకి రుణం తీసుకుని మరీ లంచం చెల్లించారని సమాచారం. గత నాలుగు నెలలుగా ఈ తంతు సాగుతోందని కార్మికులు ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే, వారి బిల్లుల సంగతి నేనే చూస్తానంటూ సదరు ఉద్యోగి బెదిరించారని అందుకే కార్మికులు భయపడుతున్నారని తెలుస్తోంది.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం:సింహాద్రి మనోహర్, కమిషనర్
పారిశుధ్య‌ కార్మికుల స్పెషల్ ఇంక్రిమెంట్ బకాయిల బిల్లులు చేయడానికి ఓ ఉద్యోగి లంచం తీసుకుంటున్నారని నాకు ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. అయినా వెంటనే కార్మికులకు కబురు చేశా. ఈ విషయంపై విచారణ చేసి వాస్తవాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

Leave a Reply