పొదిలి : రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan). ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో ఉన్న ఆయన నేడు పొగాకు బోర్డు కార్యాలయంలో ఉన్న రైతులను పరామర్శించారు. వారితో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. రైతులను అడిగి పొగాకు కొనుగోలు రేట్ల వివరాలు తెలుసుకున్నారు.
ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.. కొండపి (Kondapi), పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ మండిపడ్డారు.
ఇక, వరి, మిర్చి, పొగాకుతో పాటు ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేదని పేర్కొన్నారు. గత ఏడాది వైసీపీ పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చామని గుర్తు చేశారు. పంట వేసే సమయంలోనే రైతన్నలకు రైతు భరోసా అందించామన్నారు. గత ఏడాదిగా రైతు భరోసా కింద ఇస్తున్న సొమ్ము ఆగిపోయిందన్నారు. ప్రధాని మోదీ ఇచ్చే ఆరు వేలు కాక.. మరో 20వేలు ఇస్తామని చెప్పారని, కాని జూన్ వచ్చినా ఇంత వరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదని చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ అందించే వాళ్ళమని, .. ఆర్బీకేలతో ఉచిత పంటల బీమా అందించామని చెప్పారు.. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతకుతమ ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది.. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని జగన్ ఆరోపణలు చేశారు.

జగన్ కు మహిళల నిరసన సెగ
ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో జగన్ కి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీల (Black badges) తో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు. పొదిలిలోని బేస్తపాలెం దగ్గర జగన్ కాన్వాయ్ మీద నల్ల బెలూన్లు, చెప్పులను గుర్తు తెలియని మహిళలు విసిరారు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడిలో రాళ్లు, చెప్పులతో ఒకరిపై మరోకరు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవలో పోలీస్ కానిస్టేబులకు గాయాలు అయ్యాయి. ఇక, రాళ్ల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.
