All Party Meeting – లోక్ స‌భ స్థానాలు పెంపు 25 ఏళ్లు వాయిదా వేయాలి – రేవంత్ రెడ్డి

జ‌న‌బా ప్ర‌తిపాదిక డిలిమిటేష‌న్ అంగీక‌రించేది లేదు
గతంలో వాజ్ పేయి చేసిన విధంగానే మోదీ చేయాలి
కుటుంబ నియంత్ర‌ణ మేం పాటిస్తే.. కేంద్రం శిక్ష వేయాల‌ని చూస్తుంది.
ప‌న్నుల రూపంలో సౌత్ స్టేట్స్ ఇస్తున్న సొమ్మంతా ఉత్తరాదికి పోతున్నాయి
ఈ వివ‌క్ష పోవాలంటే ఐక్యంగా అంద‌రం కేంద్రంతో పోరాడాల్సిందే
చెన్నై అఖిల ప‌క్ష సమావేశంలో సిఎం రేవంత్ ఉద్ఘాట‌న

చెన్నై, ఆంధ్ర‌ప్ర‌భ – దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశాం.. మంచి పని చేసిన మాకు శిక్ష వేస్తారా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. న్యాయబద్ధం కానీ డీలిమిటేషన్‌పై మనమంతా బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

లోక్ స‌భ నియోజకవర్గాల పునర్విభజన లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో నేడు చెన్నై లో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా.. తక్కువ మొత్తంలోనే తిరిగి పొందుతున్నామని పేర్కొన్నారు.

‘తెలంగాణలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించాం. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించాం. తెలంగాణలో సుపరిపాలనతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం. రూపాయి చెల్లిస్తే.. తెలంగాణకు 42 పైసలు తిరిగొస్తున్నాయి. తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే లభిస్తున్నాయి. కానీ, బిహార్ మాత్రం రూపాయికి రూ.6.06 పొందుతోంది. యూపీకి రూ.2.03, మధ్యప్రదేశ్కు రూ.1.73 మేర లభిస్తోంది” అని వివ‌రించారు.

నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుందని, ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్. ఎంపీ సీట్ల డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన పలు రాష్ట్రాలకు అన్యాయం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించారు. గతంలో వాజ్‌పేయి లోక్‌సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారని, ఇప్పుడు మోడీ కూడా అదే పని చేయాలన్నారు. డీలిమిటేషన్‌లో శాస్త్రీయమైన పద్ధతి అవలంభించాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నిధుల్లో సరైన వాటా రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక అభివృద్ధి జీడీపీ, ఉద్యోగ కల్పనతో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. దేశానికి దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చేది ఎక్కువ మనకు తిరిగి వచ్చేది తక్కువ అని అన్నారు. . లోక్‌స‌భ స్థానాల పెంపును మ‌రో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని కోరారు రేవంత్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *