అందరిచూపు తంబళ్ళ హట్టి గ్రామం వైపు….

అందరిచూపు తంబళ్ళ హట్టి గ్రామం వైపు….

మడకశిర, (ఆంధ్రప్రభ): అంధుల మహిళా క్రికెట్‌లో భారత జట్టు తొలి విజయం సాధించడంతో, విజయ సారథి దీపిక స్వగ్రామం తంబళ్లహట్టి గ్రామానికి కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల అభిమానులు, మీడియా ప్రతినిధులు క్యూ కడుతున్నారు. పుట్టింది ఆంధ్రప్రాంతంలో అయినా, చదువు, క్రికెట్‌ శిక్షణ కర్ణాటకలో పొందడంతో రెండు రాష్ట్రాలు ఆమెను తమ ముద్దుబిడ్డగా అభినందిస్తున్నాయి. ఆంధ్ర–కర్ణాటక మీడియా మొత్తం ఆ గ్రామం వైపు పరుగులు తీస్తున్నాయి.

ఈ గ్రామ పరిస్థితి చూస్తే—అమరాపురం మండలం హేమావతి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబళ్లహట్టి గ్రామానికి రహదారి లేదు. కేవలం మట్టిరోడ్డులో గుంతల మధ్య ప్రయాణం చేయాల్సిందే. గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో కర్ణాటక రహదారి ఉండటంతో, గ్రామ ప్రజలు ఎక్కువగా సిరా ప్రాంతానికి వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారు. ఇదే విధంగా దీపిక కూడా కర్ణాటకలోనే చదువు కొనసాగించింది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజి మంత్రి రఘువీరారెడ్డి ఉండగా ఈ గ్రామంలో ప్రభుత్వ ఇళ్లు మంజూరయ్యాయి. ఆశ్చర్యంగా, గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఇక్కడ కన్నడ పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ పాఠశాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. పాఠశాల పక్కనే అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. ఇందులో తెలుగు బోధిస్తూ, గ్రామంలో తెలుగు–కన్నడ సంస్కృతుల సమ్మేళనం కనిపిస్తోంది.

ఇండియా కెప్టెన్‌గా ఎదిగిన దీపిక కుటుంబం ఇప్పటికీ 2006లో ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ గృహంలోనే నివసిస్తోంది. గ్రామం చుట్టూ కర్ణాటక సరిహద్దులు ఉండడంతో సరైన రహదారి లేకపోవడం సమస్యగా మారింది. కంబాలట్టి గ్రామంలోని కన్నడ పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు కన్నడలో చదువుతుండగా, పక్కనే ఉన్న తెలుగు అంగన్వాడీ కేంద్రం ద్వారా వారు మొదట తెలుగు నేర్చుకుని తర్వాత కన్నడ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది.

దీపిక కర్ణాటక ప్రభుత్వ సహకారంతో అంధుల క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడమే కాక, భారత జట్టుకు నాయకత్వం కూడా వహించింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కర్ణాటక మహిళలు కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు.

10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

అంధుల టీ–20 వరల్డ్‌కప్ గెలిచిన దీపికకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘన సన్మానం చేసి, పది లక్షల రూపాయల నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply