రేపు అన్ని దర్శనాలు ఉచితం.. ప్రత్యేక ఏర్పాట్లు !

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : గత రెండు ఆదివారాల్లో విపరీతమైన భక్తుల రద్దీ కారణంగా ఈసారి ముందస్తు చర్యలతో దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఈ ఆదివారం (20వ తేదీన) ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని దర్శన టిక్కెట్లను రద్దు చేస్తామని, ఉచిత దర్శనం కోసం అన్ని లైన్లను అందుబాటులో ఉంచుతామని దేవస్థానం ఈఓ వీకే షీనా నాయక్ తెలిపారు.
గత రెండు వారాల అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈవో తెలిపారు. భక్తుల రద్దీకి తగిన సెక్యూరిటీ, శానిటేషన్, స్పెషల్ డ్యూటీ సిబ్బందిని అప్రమత్తం చేసి విధులు నిర్వర్తించేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఇంజినీరింగ్, పరిపాలన సిబ్బంది మెట్ల మార్గాలు, ఫ్లోర్లను పరిశీలించాలి. త్రాగునీరు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాహనాల రద్దీని నియంత్రించేందుకు టోల్ గేట్ కాంట్రాక్టర్‌తో సమన్వయం చేయాలని సూచించారు.
వృద్ధులు, వికలాంగులు, పిల్లల తల్లులు మాత్రమే లిఫ్ట్‌లను ఉపయోగించడానికి అనుమతించాలని, క్యూ లైన్లలో విధులు నిర్వర్తించే సిబ్బంది వారి అవసరాలకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఉచిత ప్రసాదం, తాగునీరు, క్యూ లైన్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. వాహనాల పార్కింగ్, బస్సులు, బ్యాటరీ వాహనాల నిర్వహణపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఆషాఢ సారె బృందాలకు ఇబ్బందులు లేకుండా రాజగోపురం వద్ద రద్దీ నియంత్రణకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అన్ని విభాగాల సిబ్బంది భక్తుల సేవలో భాగస్వామ్యమై కృషి చేయాలని కోరారు. భక్తులకు సంబంధించిన మౌలిక సదుపాయాల అమలు తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా నిర్లక్ష్యం జరగకూడదని ఈవో స్పష్టం చేశారు. వీఐపీలు కూడా సహకరించాలని కోరుతూ అంతరాయాల దర్శనం రద్దు చేసినట్లు ఈవో తెలిపారు.
