ALERT | రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు..

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో రాబోయే వర్షాలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నంద‌ని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచనలను అందరూ పాటించాలని విపత్తు నిర్వహణ అథారిటీ విజ్ఞప్తి చేస్తోంది.

హైదరాబద్ సిటీలో భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలు వరుణాగ్రహంతో తడిసి ముద్దవుతున్నాయి. వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది, భారీ వర్షాలు, వరదల ముప్పు ఉందని హెచ్చరించింది.

తూర్పు, పశ్చిమ ద్రోణుల ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో కుంభవృష్టి వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు:

ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడనున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెట్లు, టవర్స్, విద్యుత్ పోల్స్ వద్ద, బహిరంగ ప్రదేశాల్లో నిలువద్దని హెచ్చరించారు.

భారీ వర్షాలు పడే జిల్లాలు:

రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

వర్షాలు ఇంకా కొనసాగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలను వీలైనంత వరకు ఎత్తైన ప్రాంతాలకు మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.

ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండి అత్యవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరుతోంది.

Leave a Reply