యూనివర్సిటీలో అవినీతిపై విద్యార్థి సంఘాల ఆందోళన

యూనివర్సిటీలో అవినీతిపై విద్యార్థి సంఘాల ఆందోళన

అవినీతి బకాసురుడి దిష్టిబొమ్మ దహనం

కర్నూలు, ఆంధ్రప్రభ : రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ సంబంధిత అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు మంగళవారం ఆందోళన చేపట్టాయి. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అవినీతి బకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పిడిఎస్‌యూ రాష్ట్ర నాయకుడు రమణ, ఆర్‌పీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఒక అధికారి “బకాసురుడిలా” మారి నిధులను అడ్డగోలుగా దోచుకుంటున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం “దున్నపోతు మీద వాన పడినట్లు” ఉందని విమర్శించారు. యూనివర్సిటీ భూములపై అక్రమ ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయని, మరోవైపు యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే మౌనం వహిస్తూ అవినీతి చేస్తున్న వారికి సహకరిస్తున్నారని విమర్శించారు. సంబంధిత అధికారిపై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.

ఈ అవినీతి అంశాన్ని ఇక్కడితో వదిలిపెట్టబోమని, త్వరలోనే ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి పరిస్థితిని వివరిస్తామని తెలిపారు. అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో యూనివర్సిటీ కార్యకలాపాలను స్తంభింపజేసేలా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ నాయకులు వంశీ, దినేష్, రాము, తేజ, బాలాజీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply