అహల్యా శాప విమోచనం…

ఒకనాడు గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో, అహల్య సౌందర్యాన్ని చూచి మోహించిన ఇంద్రుడు గౌతముని వేషంలో వచ్చి.. సుందరీ! కామాతురులు ఋతుకాలము వఱకాగరు… నీతో సంగమించ గోరుతున్నాను, అంటాడు. అహల్య తన తపశ్శక్తిచే వచ్చినవాడు ఇంద్రుడని గుర్తించి… మహేంద్రా! నేను నా దాంపత్య జీవితమున సంతృప్తితో ఉన్నాను. నీ నా గౌరవములు నిలవాలంటే వెంటనే వెళ్ళిపో అంటుంది. ఇంద్రుడు వెళ్ళేందుకప్పుడు ఉద్యుక్తుడౌతున్న సమయంలో వచ్చిన గౌతముడు ఇంద్రుని శపిస్తాడు. తపశ్శక్తి ముందు అధికారం, ఐశ్వర్యం తలవంచింది. తదుపరి అహల్యను చూచి ”ఇహ వర్షసహస్రాణి బహూని త్వం నివత్స్యసి, వాయుభక్ష్యా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ అదృశ్యా సర్వభూతానామ్‌ ఆశ్రమే…స్మిన్‌ నివత్స్యసి” అంటూ శపించి గౌతముడూ తన పాప పరిహారానికై హిమాలయాలపై తపించేందుకు వెళతాడు.
ఇంద్రుడు సంగమాన్ని కోరిన సమయంలో క్షణకాలం అహల్య బలహీనతతో కూడిన కుతూహలంతో (దేవరాజ కుతూహలాత్‌) ఆలోచించింది అంటారు వాల్మీకి మహర్షి. అపూర్వమైన వస్తువును కోరుకోవడం కుతూహలం. కుత్సితమైన పాపాన్ని బయటపెట్టేది లేదా చేయించేది కుతూహలం. దేవేంద్రునంతటివాడు నన్ను కోరివచ్చాడని అనుకున్నది అహల్య. అందుకే ”దుర్మేధా” అన్నాడు గౌతముడు. గౌతముని శాపంలో నాలుగు అంశాలున్నాయి. వాయుభక్షణం, నిరాహారత్వం, భస్మశాయినీత్వం, అదృశ్యత్వం వీటిని లోతుగా విచారిస్తే..
వాయుభక్షణ మంటే. కుండలినీ యోగాన్ని ఆభ్యసిస్తూ స్థిరంగా శిలవలె ఉండడం. నిరాహారం అంటే.. పంచేద్రియాలకు భోగ్యములైన విషయాలను విసర్జించడం. కంటికింపైన దృశ్యాన్ని చూడాలనుకోవడం, ముక్కుకు ఆహ్లాదాన్ని కలిగించే వాసనలను ఇష్టపడడం, చర్మానికి హాయిని కలిగించే స్పర్శను కోరుకోవడం, నాలుకకు రుచించే ఆహారాన్ని కావాలనుకోవడం, చెవులకు పసందైన శబ్దాలను వినాలనుకోవడం… వీటిని విసర్జించడమే కాని ఆహారం తీసుకోకుండా ఉండడమని కాదు. ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని తపించమని భావన. ఏకాగ్రతతో అంతర్ముఖీనయై నిశ్చలంగా అహల్య శిలాసదృశయై యున్నదే కాని శిలగా మారలేదు. ఆమెకు తప్పుడు ఆలోచన క్షణకాలమైనా వచ్చింది. దానిని ప్రాయశ్చిత్తంతో కడిగివేసుకోవాలి. శిలగా మారితే ప్రాయశ్చిత్తానికి, దు:ఖానుభవానికి అవకాశం ఉండదు. ఇంద్రునంతటివాడు నన్ను మెచ్చాడనే భావన సంస్కారంగా ఆమె మనసులో ముద్రితమైంది. అది పోవాలంటే ఆమె చైతన్యవంతంగానే ఉండాలి. కాని భస్మశాయినిగా అంటే సుఖానుభవం లేనిస్థితిలో ఉండాలి. ఇంద్రుని భోగలాలసత… ఆతనిపై కుతూహలం కలిగింది… కాబట్టి ఆమెలో భోగానుభవ వాంఛ పోవాలంటే… బ్రహ్మచర్య వ్రత దీక్ష అవసరం. భస్మము శరీరానికి అంతిమ సంస్కారం ద్వారా లభించేది. ఈ శరీరం భస్మసమానమనే భావనలో జీవించాలి. అందుకే భస్మశాయినీ అన్నాడు, గౌతముడు. చివరగా అదృశ్య అంటే నిన్ను ఎవరూ చూడలేరు అన్నాడే కాని ఆమె ఎవరినీ చూడలేదని లేదా చూడకూడదని అనలేదు. వేయి కన్నులు కలిగిన ఇంద్రుడు కూడా నిన్ను చూడలేడని మహర్షి భావన.
గౌతముడు ఆమెను శిలగా మారమని అనలేదు. కాని ఆమె తపస్సు నిరాటంకంగా సాగాలి అంటే ఈ లక్షణాలు ఆమె పొందాలి. అందుకే శాపరూపంలో ఆమె ప్రాయశ్చిత్తానికి మార్గంచూపాడు. అలా ఎంతకాలం తపించాలి?
”బహూని వర్షసహస్రాణి” అంటే.. అనేకవేల సంవత్సరాలు. సంచిత కర్మఫలాలు ప్రతిజీవి చిత్తంలో ముద్రలరూపంలో నిలిచి కర్మానుభవానికి ప్రేరణనిస్తావి. ఆ సంస్కారాలు పూర్తిగా లయమైతేనే కాని ముక్తిలభించదు. అందుకే చాలాకాలం తపించమని చెప్పి తానూ తన సంస్కారాల క్షాళనకై హిమాలయాలకు వెళ్ళాడు. నిజానికి శిక్ష ఎప్పుడైనా మనిషిని పరివర్తన చెందేందుకు ఉద్దేశించినదై ఉండాలేకాని అంతం చేయకూడదు. అందుకే అహల్య తపోదీక్షలో చిత్తంపై ముద్రితమైన సంస్కారాలను తొలగించుకొని, శ్రీరామ దర్శనంతో పునీతయై మరింత తేజోవంతంగా మారింది.
మహర్షి స్థానానికి గౌతముడు తగినవాడా పరీక్షించాలి. మ#హర్షి రూపంలో గౌతముని ఆశ్రమానికి వచ్చిన ఇంద్రుడు గౌతముడు వచ్చేలోపే వెళ్ళిపోవచ్చు కాని, కావాలనే అతనికి ఎదురుపడ్డాడు. తన రూపంలో ఎదురుపడవచ్చు కాని మహర్షి రూపంలోనే ఎదురుపడ్డాడు. గౌతముని మనస్సును క్రోధం ఆవరించింది. ఇరువురినీ శపించాడు. పరీక్షలో తప్పాడు. అతనూ క్రోధాన్నీ జయించాలంటే మరింతగా తపించాలి అందుకే హిమాలయాలకు వెళ్ళి తపించాడు. ఎంతకాలం అహల్యకు శిక్ష విధించాడో అంతకాలం తానూ స్వయంగా శిక్షించుకున్నాడు. ఇరువురూ తపస్సుతో పునీతులయ్యారు. రాముడే స్వయంగా అహల్యను చూచి నమస్కరించాడు. ఆమె ఇతరులకు కనిపించదు కాని శాప విముక్తి కారణంగా రామస్వామికి దర్శనం ఇచ్చింది. అదే సమయానికి గౌతముడు రావడం ఇదంతా వారి జాత్యంతరీకరణకు ప్రతీకగా నిలుస్తుంది.

-పాలకుర్తి రామమూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *