ఏజెన్సీ దళితులను ఆదుకోవాలని మంత్రికి వినతి

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాసంలో కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానం చేశారు.

గతంలో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలు, దీక్షల గురించి వివరించి, ఏజెన్సీ ప్రాంత దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి ఏజెన్సీ ప్రాంతంలోని దళితుల అసైన్‌మెంట్ భూముల సమస్యలు, పహాణీలు, బ్యాంకు రుణాలు, రైతుబంధు వంటి ప్రభుత్వ పథకాలు ఏజెన్సీ దళితులకు కూడా వర్తింపజేయాలని కోరారు.

అలాగే డ్వాక్రా గ్రూపుల సభ్యులకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.20 లక్షల రుణాలు ఇవ్వాలని, ప్రతి దళిత కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్వరలోనే ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత దళితుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చినట్లు యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు.

మంత్రిని కలిసిన వారిలో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బిరుదుల లాజర్, అరకిల్లా అశోక్, దుట రాజేశ్వర్, కాడమాండ్ల రాజమణి, కొల్లూరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply