after37yrs | ఇస్లామిక్ దేశాల్లో ప్రధాని పర్యటన

after37yrs | ఇస్లామిక్ దేశాల్లో ప్రధాని పర్యటన
ఆంధ్రప్రభ : 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్రమోడీ అనేక ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. . అంతేకాదు.. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు భారత దేశ ఆర్థికాభివృద్ధికి పనికొచ్చే ఒప్పందాలు చేసుకోవడంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఘనాపాఠి. ఇందులో భాగంగానే తాజాగా జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ (Oman) దేశాలలో ఆయన పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జరిపిన మూడు దేశాల పర్యటన విజయవంతమైంది. జోర్డాన్, ఒమన్ పూర్తిగా ఇస్లామిక్ దేశాలు కాగా, ఇథియోపియా సెక్యులర్ దేశమైనప్పటికీ.. ముస్లింల జనాభా రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
ఇస్లామిక్ దేశాలతో బంధాన్ని బలపరుచుకోవడంతో పాటు ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. భారత్-జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జోర్డాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పర్యటించారు. అంతే కాదు, 37 సంవత్సరాల తరువాత భారత్ ప్రధాని ఒకరు జోర్డాన్‌లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక పర్యటన జరపడం ఇదే తొలిసారి.

after37yrs | ఇదే తొలిసారి
కాగా ప్రస్తుతం భారత్ -జోర్దాన్ రెండూ… ఉగ్రవాదంపై పోరులో పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో (April) జరిగిన పహెల్గామ్ ఉగ్ర దాడిని జోర్డాన్ రాజు ఖండించారు. భారత్‌కు అండగా నిలిచారు. అంతే కాదు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా… మట్టు పెట్టాల్సిందేనన్నారు.
పర్యటనలో రెండో అంకంగా ఇథియోపియా చేరుకున్న నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. కాగా ఇథియోపియా ప్రధాని అహ్మద్ అలీ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆయన బస చేసిన హోటల్‌కు తీసుకెళ్లారు. నరేంద్ర మోడీని ప్రయాణించిన కారును సాక్షాత్తూ ఆతిథ్య దేశ ప్రధాని నడపడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం ఇథియోపియా ప్రధాని అహ్మద్ అలీ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. భారత (india) జాతీయ గీతమైన వందేమాతరాన్ని ఇథియోపియా గాయకులు ఆలపించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆనంద పరవశులయ్యారు. సంతోషంతో ఆయన చప్పట్లు కొట్టారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే ఇథియోపియా జాతీయ అత్యున్నత పురస్కారాన్ని కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రదానం చేశారు.
after37yrs | భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ
కాగా ఇథియోపియాలో ప్రధానమంత్రి (Primeminister) నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, ఇథియోపియాకు భారతదేశం రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కాగా 1940లలోనే భారత్-ఇథియోపియా మధ్య సంబంధాలు మొదలయ్యాయి. కాగా దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత 1950లో రెండు దేశాల మధ్య అధికారిక వాణిజ్యం ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే చివరిగా ఒమన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు.భారత్ ఒమన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సాగింది. కాగా భారత్ ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ (Oman) పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఒక విశేషం.
సదరు వాణిజ్య ఒప్పందంపై భారతదేశం తరఫున విదేశాంగ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ తరఫున ఆ దేశ మంత్రి కియాస్ బిన్ మహమ్మద్ సంతకాలు చేశారు. కాగా ఈ ఒప్పందం ఫలితంగా ఉభయ దేశాలకు వాణిజ్య పరంగా మరింతగా ప్రయోజనాలు ఉంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాదు, ఉభయ దేశాల సంబంధాలలో సదరు స్వేచ్చా వాణిజ్య (commercial) ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

after37yrs | ఇద్దరు నేతల సమాలోచనలు
ఇదిలా ఉంటే, ఒమన్ ఉప ప్రధాని (Deputy Prime Minister of Oman) సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన స#హకారం, రక్షణ, భద్రత, సాంకేతికత వంటి కీలక అంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
అలాగే ఉభయ దేశాల మధ్య మైత్రీ సంబంధాలు మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ 2018లో తొలిసారి ఒమన్‌లో పర్యటించారు. ఆ తరువాత ఇప్పుడు మరోసారి అక్కడకు వెళ్లారు. మొత్తంమీద ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన ఇస్లామిక్ (Islamic) దేశాల్లో చేసిన పర్యటన విజయవంతమైంది.

- ఎస్.అబ్దుల్ ఖాలిక్
