చనిపోయిన రైతు బీమా కోసం లంచం…

చనిపోయిన రైతు బీమా కోసం లంచం…
పట్టుబడిన ఏఈఓ
మరిపెడలో ఏసీబీ ఉచ్చు – రూ.10వేలు స్వీకరిస్తూ పట్టుబడ్డ వ్యవసాయ అధికారి
చిన్న గూడూరు (మరిపెడ) నవంబర్ 6 (ఆంధ్రప్రభ) : చనిపోయిన రైతు కుటుంబానికి ప్రభుత్వం అందించే బీమా మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన అగ్రికల్చర్ అధికారి ఏసీబీ (ACB) వలలో చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
ఏసీబీ డీఎస్పీ సాంబయ్య (ACB DSP Sambaiah) తెలిపిన వివరాల ప్రకారం… మరిపెడ మండలంలోని అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14న మృతి చెందగా, ఆయన కుమారుడు నామినీగా రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అనేపురం క్లస్టర్ ఏఈఓ గాడిపెళ్లి సందీప్ బీమా పత్రాలు ఆన్లైన్‌లో పంపించాలంటే రూ.20 వేల లంచం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
డబ్బులు ఇవ్వకుండానే పని చేయించుకోవాలని నిర్ణయించిన రైతు కుమారుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అయితే గురువారం మరిపెడలోని జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏఈఓ సందీప్‌ను పట్టుకున్నారు. నిందితుడిని శుక్రవారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేయనున్నట్లు డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో ఇన్స్పెక్టర్లు ఎల్.రాజు, శేఖర్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
