Adilabad | జై నాగోబ జై జై నాగోబాకు నీరాజనం..

Adilabad | జై నాగోబ జై జై నాగోబాకు నీరాజనం..
- గోవాడ్‌లో మట్టి కుండల్లోనే మహా ప్రసాదం.
Adilabad | ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోనే సమ్మక్క సారలమ్మ తరువాత రెండవ అతి పెద్ద జాతరగా పేరు పొందిన కేస్లాపూర్ లోని నాగోబాకు అర్ధరాత్రి మహా జలాభిశేఖంతో సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ పూజకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఉట్నూర్ ఇన్చార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏ.ఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ ఏ.ఎస్పీ. మౌనిక, జిల్లా ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు వెడ్మ భోజ్జు పటేల్, అనిల్ జాధవ్, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్ రావ్, పీఠాధిపతి వెంకట్ రావ్, సర్పంచ్ మెస్రం తుకారాం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారి ఆచార సాంప్రదాయ ప్రకారం తెల్లటి తల పాగాను ధరించారు.

అనంతరం వారి ఆచార సాంప్రదాయ వాయిద్యాలైన కాలికోమ్, తుడుమ్, సన్నాయిలను వాయిస్తూ.. కాగడాలను వెలిగిస్తూ.. ఆలయంలోకి ప్రవేశించారు. నాగోబాకు మహాపూజ హారతినిచ్చారు. ఖటోడ (హన్మంతు), కోసేరావ్ తో పాటు మెస్రం వంశీయులు ఈ పూజను నిర్వహించారు. పూజ అనంతరం నాగోబాను దర్శించుకున్నారు. పూజ రోజున మెస్రం వంశీయులు దినమంత కఠిన ఉపవాస దీక్షను చేపట్టారు. రాత్రి సుమారు మూడు గంటలకు మెస్రం కోడళ్లను నాగోబా సన్నిధిలో భేటింగ్ నిర్వహించారు. మెస్రం కోడళ్ల భేటింగ్.. (పరిచయం) నాగోబా పూజ అనంతరం మెస్రం వంశీయుల కోడళ్ళు ఈ నాగోబా సన్నిధిలో భేటింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో తెల్లటి వస్త్రాన్ని ముసుగు వరకు ధరించడం వారి సాoప్రదాయం. నాగోబా సన్నిధిలో తమ కుల పెద్దలకు పరిచయం చేశారు. ఈ సంవత్సరo 97 జంటల మెస్రం కోడళ్ల భేటింగ్ చేశారు.
Adilabad | కొత్త కుండల్లోనే వంటకాలు..
గోవాడ్ లో బస చేసిన మెస్రం ఆడపడుచులు ఈ రోజు కొత్త కుండల్లో జొన్న గటకతో ప్రసాదాన్ని చేశారు. వంటకాలకు ముందు కొత్త కుండల వద్ద నవ ధాన్యాలను సమర్పించారు. జొన్న గటకతో వండిన లడ్డూల రూపంలో తయారు చేసి 22 కీతల వారిగా పంచుకున్నారు. ఈ వంటకంతోనే పవిత్ర ఉపవాస దీక్షను విరమింప చేశారు.

Adilabad | భక్తులకు పటిష్ట ఏర్పాట్లు…
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే సమ్మక్క సారలమ్మ తరువాత రెండవ అతి పెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన నాగోబా జాతర భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ జాతరకు రాష్ట్ర ప్రజలే గాక మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, ఎంపీ తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తారన్నారు. జాతర శాంతి యుతంగా జరుపాలని కోరారు.
