TG | ములుగు జిల్లా పర్యటనకు బయలుదేరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రానున్నారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే..

ఈ క్రమంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం.. గ్రామస్థులతో సమావేశమై సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మలను దర్శనం చేసుకోనున్నారు. కాగా.. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గతేడాది ఆగస్టులో ములుగు పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్రమంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తికి స్పందించి తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

ఆ ఊరి అభివృద్ధికి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో కేవలం 79 గడపలు, 370 జనాభా కలిగిన అటవీ గ్రామమైన కొండపర్తి రూపు రేఖలు మారిపోయాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీలకు నూతన భవనాలు నిర్మించారు. డిజిటల్ బోధనను అమలు చేస్తున్నారు. మహిళలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం మసాలా తయారీ, టైలరింగ్, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివాసీ రైతుల వ్యవ సాయ అవసరాల కోసం బోరు మోటారును అందుబాటులోకి తెచ్చారు.

మరుగుదొడ్లు, అంతర్గత రోడ్లు, తాగునీటి వసతిని మెరుగుపర్చారు. సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. అందరికీ ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇండ్లను మంజూరు చేశారు.

ఈ క్రమంలో ఈ పనులు పూర్తికావడంతో మంగళవారం గవర్నర్ వాటిని ప్రారంభించేందుకు అడవిపల్లె కొండపర్తికి వస్తున్నారు. వాటి ప్రారంభోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అనంతరం గ్రామస్తులతో సమావేశమవుతారు.

గవర్నర్ పర్యటన షెడ్యూల్..

మంగళవారం ఉదయం రాజ్‌భవన్ నుంచి ఉదయం 8 గంటలకు రోడ్డుమార్గాన బయలు దేరి ములుగుకు వెళ్ళారు.. గట్టమ్మ సమీపంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో కొద్దిసేపు సేద తీరుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి 11:15 గంటలకు తాడ్వాయి మండలం కొండపర్తికి చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత గ్రామస్థులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:45 గంటలకు మేడారం వెళ్తారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. స్థానిక ఐటీడీఏ అతిథి గృహంలో భోజనం చేసిన తర్వాత 2:30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *