నిజామాబాద్ ప్రతినిధి, ఫిబ్రవరి 28 (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు సకాలంలో పన్నులు చెల్లించకుంటే చర్యలు తప్పవని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ హెచ్చరించారు. పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
శుక్రవారం నిజాంబాద్ నగరంలోని పలు డివిజన్ లో పన్ను వసూళ్లలో భాగంగా కార్పొరేషన్ బృందం పర్యటించారు. నగరంలోని వినాయక్ నగర్ లోని అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్ భవన యజమాని గత ఐదు సంవత్సరాలుగా ప్రాపర్టీ టాక్స్ చెల్లించలేదు. అంతేకాకుండా అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోలేదు.
శుక్రవారం కార్పొరేషన్ బృందం వ్యాపారానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోనందున, పన్ను చెల్లిం చనందున మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు ఐస్ క్రీమ్ పార్లర్ దుకాణాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా వినాయక్ నగర్ లోని విశాల్ మార్ట్, ఎల్.జి. షోరూం, నగరంలోని పలు వ్యాపార, వాణిజ్య కేంద్రాలను కార్పొరేషన్ బృందం సందర్శించారు.
ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీస్ పన్ను బకాయిలను పరిశీలించారు. ఈ సందర్భంగా నగర్ కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతూ… పన్నులు, బకాయిలు ఉంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.