మద్దూరు, ఏప్రిల్ 8(ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల కోసం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. సన్న బియ్యం పంపిణీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండల పరిధిలోని నిడ్జింత గ్రామంలోని ఒక రేషన్ దుకాణంలో ఒక లబ్ధిదారుడు రేషన్ బియ్యం బస్తా ఇంటికి తీసుకుపోయి పరిశీలించి దొడ్డు బియ్యం ఉందని గమనించి తిరిగి రేషన్ షాపుకి తీసుకువచ్చి సన్న బియ్యం బస్తా తీసుకెళ్లాడు. లబ్ధిదారులు రేషన్ బియ్యం కోసం వెళ్తే అక్కడ సన్న బియ్యం, దొడ్డు బియ్యం మిక్సింగ్ అయి రావడం జరిగింది. దొడ్డు బియ్యం వస్తున్నదని ప్రశ్నించగా.. దొడ్డు బియ్యం వస్తే పై అధికారులు పక్కన పెట్టమన్నారని రేషన్ డీలర్ తెలిపారు. సన్న బియ్యంలో దొడ్డు బియ్యం వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం…
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రేషన్ బియ్యంకు అడ్డుకట్ట వేయడానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. రేషన్ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారిని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం – ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఆనంద్
ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యాన్ని అవసరాల కోసం వినియోగించాలని, విక్రయించకూడదని తెలిపారు. ఎవరైనా పీడీఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు, విక్రయిచినట్లు గుర్తిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, వారి రేషన్ కార్డు తొలగిస్తామని హెచ్చరించారు. లబ్దిదారులకు ఇచ్చే రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే డీలర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ దుకాణంకు బియ్యం లోడ్ వచ్చినపుడు సన్న బియ్యంలో దొడ్డు బియ్యం పొరపాటున వస్తే వెంటనే స్థానిక తహసీల్దార్, డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీ ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జీలకు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, లేదంటే రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.