తరుగు పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు..

  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : తాలు, తేమ, తరుగు పేరుతో వరి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ దోచుకునే ప్రయత్నాలు చేస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు.

గురువారం భూపాలపల్లి కలెక్టరేట్‌లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, డీఆర్‌డీఓ, పోలీస్, రవాణా మరియు ఇతర శాఖల అధికారులు వానాకాలం (ఖరీఫ్) వరి ధాన్యం కొనుగోళ్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. వరి ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలని, ధాన్యం విక్రయించిన తరువాత రైతుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తూకం అయిన తరువాత ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలదే బాధ్యత అని పేర్కొన్నారు. తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు.

ధాన్యం రవాణాలో ఇబ్బందులకు గురి చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. పోలీస్, రవాణా అధికారులు సమన్వయం చేసుకుని లారీలు తనిఖీ చేయాలని ఆదేశించారు. లారీలు సకాలంలో రాకపోవడంతో రైతులు ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారని, ట్రాన్స్‌పోర్టర్లు రైతులకు డబ్బులు ఇవ్వక ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లు రైతుల పక్షాన ఉండాలని, వ్యాపార దృష్టితో కాకుండా రైతుల సంక్షేమ దృష్టితో వ్యవహరించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు జరగాలని, ట్యాబ్ ఎంట్రీలు సత్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పోయినేడాది రవాణా సమస్యలు ఎదురయ్యాయని, ఈ ఏడాది అలాంటి సమస్యలు రాకుండా సదరు కాంట్రాక్టర్లతో పోలీస్, రవాణా శాఖ అధికారులు ముందస్తుగా సమావేశం నిర్వహించాలని సూచించారు. మండల స్థాయిలో ఎస్సై, ఎమ్మార్వో, వ్యవసాయాధికారులు తరచూ తనిఖీలు చేయాలని తెలిపారు.

వరి కోత యంత్రాలు 18 నుండి 26 ఆర్‌పిఎం వద్ద కోత జరపడం వల్ల తాలు తక్కువగా వస్తాయని, దీనిపై వరికోత వాహనదారులకు మండల స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే గండ్ర ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీసీఎస్ఓ కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply